వరంగల్‌రూరల్, ఆగస్టు 15(నమస్తేతెలంగాణ): ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన గండ్ర జ్యోతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించి పరేడ్‌ను పర్యవేక్షించారు. ప్రభుత్వ శాఖల నుంచి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్ ఎం హరిత, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఓడీసీఎంస్ చైర్మన్ రామస్వామినాయక్‌తో కలిసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను సంఘటితం చేసేందుకు జిల్లాలోని 74 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించినట్లు తెలిపారు. పంట పెట్టుబడి కోసం ఏటా రెండు విడుతల్లో ఎకరానికి రూ. 10 వేల సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 561 మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 28.05 కోట్ల బీమా సొమ్ము అందజేసినట్లు వివరించారు. ఉద్యాన శాఖ నుంచి ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు జిల్లాలో 57 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టేందుకు రైతులకు అవగాహన కల్పించినట్లు జడ్పీ చైర్పర్సన్ తెలిపారు.
పంట రుణాల మాఫీ
జిల్లాలో తొలివిడుత రూ. 25 వేల వరకు రుణం ఉన్న 11,521 మంది రైతులకు ప్రభుత్వం రూ. 9.64 కోట్లు మాఫీ చేసినట్లు గండ్ర జ్యోతి చెప్పారు. రెండో విడుత రూ. 50 వేల వరకు పంటరుణం ఉన్న 19,634 మంది రైతులకు రుణమాఫీతో రూ. 56.60 కోట్ల లబ్ధి చేకూరినట్లు ఆమె వెల్లడించారు. ధరణి ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 7,041 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ప్రకటించారు. ఆసరా పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు 89,145 మందికి ప్రతి నెల రూ. 20.03 కోట్ల పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల నుంచి 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి కూడా ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 2010-21లో జిల్లాలోని 1,749 స్వశక్తి సంఘాలకు రూ. 65.72 కోట్ల బ్యాంకు రుణాలు, స్త్రీనిధి ద్వారా రూ. 10.05 కోట్లు అందించినట్లు జడ్పీ చైర్ పర్సన్ తెలిపారు. ఉపాధిహామీ పథకం నుంచి అర్హత గల ప్రతి ఒకరికీ జాబ్‌కార్డు జారీ చేయడం ద్వారా 22.45 లక్షల పనిదినాలు కల్పించి రూ. 60.17 కోట్ల వేతనం కూలీలకు చెల్లించినట్లు చెప్పారు. ఎంపీల్యాడ్స్ స్కీమ్ నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో రూ. 10 లక్షలతో ఓపెన్‌జిమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 888 పాఠశాలల్లో గత జూలై ఒకటి నుంచి విద్యా శాఖ ఆన్లైన్ ద్వారా బోధన చేసినట్లు చెప్పారు.
పల్లె, పట్టణ ప్రగతి పనులు..
గ్రామాలు, పట్టణాల సమగ్ర ప్రగతికి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టిందని జడ్పీ చైర్పర్సన్ అన్నారు. పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడం ద్వారా సేంద్రియ ఎరువు తయారీ జరుగుతున్నట్లు తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. జిల్లాలో హ్యాబిటేషన్లను కలుపుకుని 651 పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఏప్రిల్ నుంచి జూలై వరకు రూ. 18.90 కోట్లతో జీపీల్లో పారిశుధ్యం సహా ఇతర పనులు చేపట్టినట్లు వెల్లడించారు. నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా ప్రణాళికలు తయారు చేసి పట్టణప్రగతి కార్యక్రమం ద్వారా తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ నుంచి 75 శాతం సబ్సిడీపై గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలకు జిల్లాలో తొలి విడుత 12,939 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు ప్రకటించారు. రెండో విడుత 2020-21లో 13,176 యూనిట్ల పంపిణీకి ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 2020 క్రిస్మస్ పండుగకు జిల్లాలో 3,500 మంది పేద క్రిస్టియన్లకు, 2021 రంజాన్ పండుగకు 4,500 మంది పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. నెక్కొండలో రూ. కోటితో షాదీఖాన నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు.
సాధికారత దిశగా..
దళితుల సాధికారత దిశగా దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున నగదును ఉచింతంగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. చివరగా ఇక్కడ ఏర్పాటు చేసిన హోమ్ ఇనోవేటర్లను కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, డీసీపీ వెంకటలక్ష్మి, అదనపు కలెక్టర్ హరిసింగ్‌తో కలిసి పరిశీలించారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, వరంగల్ ఆర్డీవో మహేందర్‌జీ, డీఆర్డీవో ఎం సంపత్‌రావు, జడ్పీ సీఈవో రాజారావు, ఎక్సైజ్‌శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, డీపీవో ప్రభాకర్, డీఏవో ఉషాదయాళ్, డీఎంహెచ్‌వో మధుసూదన్, డీసీవో సంజీవరెడ్డి, నర్సంపేట, మామునూరు, పరకాల ఏసీపీలు ఫణీందర్, నరేశ్, జే శివరామయ్య, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.