మహబూబాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో మహబూబాబాద్‌ను ప్రథమ స్థానంలో నిలుపుతామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హత కల్గిన ప్రతి దళిత కుటుంబానికీ రూ.10లక్షలు అందిస్తామన్నారు.
దళితు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జిల్లాలో రూ.23.10కోట్లతో రోడ్ల నిర్మాణాలు, రూ. 140.95కోట్ల అంచనా వ్యయంతో రైల్వేకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. రూ.49.08 కోట్లతో చేపట్టిన కలెక్టర్ కార్యాలయంతో పాటు వివిధ అభివృద్ధి పనులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. జిల్లాలో ఈ సంవత్సరానికి ఇప్పటి వరకు 16,460 టన్నుల చేపలు, 119 టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేశామని, 1075 చెరువుల్లో 4.52 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. గొర్రెల అభివృద్ధి పథకం ద్వారా 11,640 సభ్యులకు మొదటి విడుతలో 640 యూనిట్లు అందించామన్నారు. 1,71,474 మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా రూ. 197.48 కోట్లు జమయ్యాయన్నారు.
రైతుబీమా కింద 487మందికి రూ. 24.35కోట్లు అందించామన్నారు. రుణమాఫీ ద్వారా 15,364మంది రైతులు లబ్ధి పొందనున్నారన్నారు. 122 హె క్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేపట్టామన్నారు. 2,13,862 మందికి జాబ్‌కార్డులు జారీ చేసి, 9కోట్ల పనిదినాలు కల్పించామన్నారు. వయసు సడలింపుతో కొత్తగా 18,162మందికి ఫించన్లు రానున్నాయన్నారు. ధరణి ద్వారా 13,714 ఎకరాల భూములు రిజిస్ట్రేషన్ చేసి పాస్‌బుక్‌లు అందించామన్నారు.
మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని 1,98,275 ఇళ్లకు నల్లాల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని, 6,035 మందికి కొత్త రేషన్‌కార్డులు అందించామన్నారు. జిల్లాలో 2020-21 సంవత్సరానికి గాను 129 పారిశ్రామిక యూనిట్లు టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు పొందాయని, ఇందులో 68 యూనిట్లు ప్రారంభమయ్యాయని, 435మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. జిల్లాలో 1283 అంగన్వాడీలు, 147 మినీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా 42,118మంది పిల్లలకు, 11,524 మంది గర్భిణులు, బాలింతలకు ల బ్ధి చేకూరుతుందన్నారు. గిరిజన ఆ వాస ప్రాంతాల్లో రూ. 1270.37 కోట్లతో 2,117 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల పనులు ప్రారంభించామన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ -1 కింద 1,91,088 ఎకరాలు సాగులోకి వచ్చాయని, 737 చెరువులు, కుంటల ద్వారా 57,698 ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. హరితహారం ద్వారా ఈ సంవత్సరంలో 43.77లక్షల మొక్కలు నాటడం లక్ష్యంకాగా ఇప్పటివరకు 31.46లక్షలు నాటామన్నారు.
జిల్లాలో పల్లె ప్రగతి ద్వారా 461 గ్రామ పంచాయతీల పరిధిలో 702 పల్లె ప్రకృతి వనాలు, ప్రతి మండలంలో 10 ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా రూ.148 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ మెడికల్, నర్సింగ్ కళాశాల పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. త్వరలోనే పట్టణవాసులకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అభిలాషా అభినవ్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.