
చెన్నారావుపేట, ఆగస్టు 11: జిల్లాలోని పలు మండలాల్లో ప్రజలు బుధవారం పోచమ్మ బోనాలను ఘనంగా జరుపుకున్నారు. భక్తులు అమ్మవారి ఆలయాలకు బోనాలతో చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎంపీపీ బదావత్ విజేందర్ జిల్లా ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. చెన్నారావుపేటలో వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి దంపతులు అమ్మ వారికి చీరను బహూకరించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు రాసమల్ల సతీశ్, బీజేపీ జిల్లా నాయకుడు వనపర్తి మల్లయ్య, పూజారులు భిక్షమయ్యశాస్త్రి, సాయిపవన్కల్యాణ్శాస్త్రి పాల్గొన్నారు.
దుగ్గొండి: గిర్నిబావిలో పోచమ్మతల్లి బోనాల పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి డప్పుచప్పుళ్లు, గొల్లకురుమల డోలు వాయిద్యాల నడుమ గొర్రెలు, కోళ్లు, బోనాలతో ర్యాలీగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి చీరసారెలతో మొక్కులు తీర్చుకున్నారు. గొర్రెలు, కోళ్లను బలిచ్చి పాడిపంటలు, పిల్లాపాపలతో సల్లంగా ఉండాలని తల్లిని వేడుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కూస సమతారాజు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కులసంఘాల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఖానాపురం: మండలంలోని ఖానాపురం, బుధరావుపేటలో పోచమ్మతల్లికి బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకుని పోచమ్మతల్లికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
వర్ధన్నపేట: ఇల్లందతోపాటు వర్ధన్నపేట పట్టణంలో పోచమ్మకు బోనాలు సమర్పించారు. శ్రావణమాసంలో గ్రామదేవత పోచమ్మకు బోనాలు చేసి మొక్కులు చెల్లిస్తే ఎలాంటి వ్యాధులు దరిచేరవని ప్రజల నమ్మకం. పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
నెక్కొండ: మండలకేంద్రంలో డప్పువాయిద్యాల నడుమ మహిళలు నెత్తినబోనం ఎత్తుకొని ముత్యాలమ్మతల్లి గుడికి తరలివెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆయురారాగ్యోలతో చల్లగా చూడు తల్లీ అంటూ అమ్మవారిని వేడుకున్నారు. సర్పంచ్ సొంటిరెడ్డి యమున ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించారు.
రాయపర్తి: శ్రావణమాసం నేపథ్యంలో ముత్యాలమ్మ, మారెమ్మ, పెద్దమ్మతల్లికి ఘనంగా బోనాలు నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో బోనాలతో ఆలయాలకు తరలివెళ్లి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండలకేంద్రంలో యాదవ కులస్తులు పెద్దఎత్తున తరలివెళ్లి గ్రామ దేవతలకు పూజలు చేశారు. కార్యక్రమాల్లో రాజుయాదవ్, రామ్మూర్తియాదవ్, ధర్మయ్య, ప్రభాకర్, రమేశ్, రాజు, లింగయ్య, నర్సయ్య, రామ్‌యాదవ్, లింగయ్య, సంపత్, సాంబరాజు, మధు, రాంబాబు, యాదగిరి, సాయిలు, ఉప్పలయ్య పాల్గొన్నారు.
పర్వతగిరి: మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో తరలివెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. చౌటపెల్లిలో బోనాలతో ఊరేగింపుగా పురవీధుల గుండా బయల్దేరి వెళ్లారు. శివసత్తుల పూనకాలతో మహిళలు పోచమ్మ ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.