
గీసుగొండ, ఆగస్టు 11: వైకుంఠధామాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. మండలంలోని దస్రుతండా, చంద్రయ్యపల్లి, సూర్యతండా, ఆరెపల్లి, కోనాయిమాకులలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా హరిసింగ్ మాట్లాడుతూ ఈ నెలాఖరుకల్లా వైకుంఠధామాల పనులను పూర్తి చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓవైపు ప్రభుత్వం సీరియస్‌గా శ్మశాన వాటికల పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల్లో మార్పు రావడం లేదని తెలిపారు. పని చేయని వారిపై వేటు తప్పదని స్పష్టం చేశారు. సమన్వయంతో పని చేసినప్పుడే పనుల్లో పురోగతి ఉంటుందన్నారు. మండలస్థాయి అధికారులు రోజూ గ్రామాల్లో పర్యటించి పనుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను రక్షించాలన్నారు. వారంలో మూడు రోజులు మొక్కలకు నీళ్లు పోయాలని సూచించారు. చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏసీవో మోహన్‌రావు, సర్పంచ్‌లు కేలోత్ సరోజన, స్రవంతి, జ్యోతి, రజిత, డోలి రాధాబాయి, కార్యదర్శులు పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనుల్లో వేగం పెంచాలి
చెన్నారావుపేట: మండలంలో పెండింగ్‌లో ఉన్న పల్లెప్రగతి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు సూచించారు. ఇన్చార్జి ఎంపీడీవో దయాకర్, ఎంపీవో గౌడ సురేశ్‌తో కలిసి ఆయన పలు గ్రామాల్లో పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎల్పీవో ధర్మాతండాలోని డంపింగ్ యార్డు, క్రిమిటోరియం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్‌ని ఆదేశించారు. అలాగే, బోజెర్వు గ్రామంలో బృహత్ పల్లెప్రకృతి వనానికి స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆంగోత్ అరుణావీరాసింగ్, పిండి విజయాభిక్షపతి, కార్యదర్శులు పాల్గొన్నారు.
శ్మశానవాటిక పనుల పరిశీలన
నడికూడ: కంఠాత్మకూర్‌లో శ్మశానవాటిక పనులను డీఎల్పీవో కల్పన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎల్పీవో మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో శ్మశాన వాటిక పనులు పూర్తి కాలేదని, త్వరగా పూర్తి చేయాలని అధికారులు, సర్పంచ్‌లను ఆదేశించారు. అనంతరం కంపోస్టు షెడ్‌ను పరిశీలించి బాగుందని కితాబిచ్చారు. ఆమె వెంట సర్పంచ్ రేకుల సతీశ్, కార్యదర్శి ఉన్నారు.
మొక్కల ఎదుగుదలకు దోహదం
నల్లబెల్లి: వర్మీకంపోస్టు వాడడం వల్ల మొక్కలు ఏపుగా ఎదుగుతాయని ఎంపీవో కూచన ప్రకాశ్ అన్నారు. లెంకాలపెల్లి డంపింగ్ యార్డులో తయారు చేసిన వర్మీకంపోస్టును గ్రామంలోని అవెన్యూ ప్లాంటేషన్, పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కలకు వాడుతున్న విధానాన్ని ఎంపీవో పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వర్మీకంపోస్టును తయారు చేస్తున్నట్లు వివరించారు. తయారు చేసిన ఎరువును ఆయా గ్రామాల్లో నాటిన మొక్కలకు వినియోగిస్తూనే జీపీకి అదనపు ఆదాయం సమకూర్చేందుకు రైతులకు విక్రయిస్తామని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ లక్ష్మి, కార్యదర్శి ప్రశాంత్, మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయాలి
శాయంపేట: మండలంలోని వైకుంఠధామాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి సూచించారు. నర్సింహులపల్లి, గట్లకానిపర్తి, సూరంపేట, వసంతాపూర్, గంగిరేనిగూడెం, సూర్యనాయక్‌తండా, కాట్రపల్లి, నూర్జహార్పల్లిలోని శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులను ఆయన పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని తెలిపారు. ఆయన వెంట ఈజీఎస్ ఏపీవో అనిత, సర్పంచ్‌లు ఉన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో ఎంపీడీవో సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి కొత్త జాబ్‌కార్డులు అందజేశారు.