
కమలాపూర్, ఆగస్టు 11 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస యాదవ్‌ను లక్ష మెజార్టీతో గెలిపిస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బుధవారం కమలాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే శ్రీనివాస్ యాదవ్.. వెన్నుపోటు పొడిచే వ్యక్తి ఈటల రాజేందర్‌కు మధ్య పోటీ జరుగుతోందన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ బలమైన అభ్యర్థిగా అభివర్ణించారు. బీసీ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి లాఠీ దెబ్బలు తిని జైలు జీవితం గడిపిన వ్యక్తి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థి నాయకున్ని అసెంబ్లీకి తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువతతో కలిసి కృషి చేస్తామన్నారు. మాటల ప్రభుత్వం మోదీకి, చేతల ప్రభుత్వం కేసీఆర్‌కు మధ్య జరిగే పోటీ అన్నారు. 15 ఏళ్లు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ వెంట నడిచి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మండల ఇన్చార్జి డాక్టర్ పేర్యాల రవీందర్రావు, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.