
రాయపర్తి, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలతో పల్లెలన్నీ అభివృద్ధి పథంలో పరుగులు పెడుతూ క్రమంగా పట్టణ శోభను సంతరించుకుంటున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని ఆర్‌అండ్‌ఆర్‌కాలనీలో సర్పంచ్ చెడుపాక కుమారస్వామి నేతృత్వంలో ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఏండ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలకు పల్లెప్రగతితో శాశ్వత పరిష్కారాలు లభిస్తున్నాయన్నారు. గ్రామ పంచాయతీల నేతృత్వంలో చేపట్టే కార్యక్రమాలకు స్థానికులు స్వచ్ఛందంగా సహకరిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి పథంలోకి వెళ్తాయని సూచించారు. రాష్ట్రంలోని దళితులందరికీ రెండేళ్లలోగా దళితబంధు పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో రాష్ట్రమంతటా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, పూస మధు, జక్కుల వెంకట్‌రెడ్డి, బీ సుధాకర్, ఎన్ సోమయ్య, కే శ్రీనివాస్‌రెడ్డి, టీ సంతోష్‌గౌడ్, సీహెచ్ రవి, బీ జగన్నాయక్, టీ మల్లేశ్ పాల్గొన్నారు.