
నగరవాసులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కార్గో ద్వారా పార్సిల్, కొరియర్ సేవలు బస్టాండ్ వరకే పరిమితం కాగా, ఇక నుంచి ఇంటి వద్దకే చేర్చే వెసులుబాటు కల్పించింది. ఈమేరకు బుధవారం డోర్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించగా, ట్రైసిటీ ప్రజలు ఈ సేవల్ని వినియోగించుకోవాలని ఆర్ఎం విజయ్‌భాస్కర్ కోరారు. ఈ తరహా సేవలు ఆర్టీసీ తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెట్టగా విజయవంతమవడంతో తాజాగా వరంగల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
కరోనా సమయంలో సంస్థకు ఆదాయం సమకూరేలా ఆర్టీసీ కొత్త పంథాలో కార్గో సర్వీస్‌ను అందుబాటులోకి తేవడంతో పాటు డిమాండ్‌ను బట్టి క్రమక్రమంగా తన సేవల్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం వరంగల్ రీజియన్‌లో డోర్ టు డోర్ కొరియర్ సర్వీసును ప్రారంభించింది. ఇప్పటివరకు బస్స్టేషన్లు, బస్‌డిపోల వరకే పార్సిళ్లు చేరవేస్తుండగా ఇక నుంచి పార్సిల్ కవర్లను నేరుగా ఇంటికి చేరవేస్తుంది. ముఖ్యంగా గార్మెంట్, కూరగాయల వ్యాపారులు ఇలాంటి సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. దీంతో పార్సిళ్లను ఇళ్లు లేదా కార్యాలయాలకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఒక్కో సెక్టార్ నుంచి ఒక్కో ఏజెన్సీ బాధ్యత తీసుకుంటాయి. చిన్న చిన్న వస్తువులకు కూడా ఇష్టమొచ్చినట్లు చార్జీ వసూలు చేసే ప్రైవేట్ వాహనాల డ్రైవర్లతో ఇబ్బందులు తీరనున్నాయి.
డోర్ టు డోర్ డెలివరీ..
ఇప్పటికే ఆర్టీసీ పార్సిల్ సేవలకు వరంగల్‌లో మంచి ఆదరణ ఉంటున్నది. బల్క్ పార్సిల్స్కే డెలివరీ సదుపాయం కల్పిస్తుండగా ఎంతో మంది వినియోగించుకుంటున్నారు. ఇలా ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఆదరణ చూసి వరంగల్ రీజియన్‌లో కొత్తగా డోర్ డెలివరీ సేవలను ప్రారంభించింది. కార్గో పార్సిల్ హోం డెలివరీ సేవలు హైదరాబాద్‌లో విజయవంతం కావడంతో ప్రస్తుతం వరంగల్లోనూ అమలుచేస్తున్నారు. తక్కువ కాలంలోనే రోజువారీ ఆదాయాన్ని ఆర్టీసీ వృద్ధి చేసుకుంటూ వస్తోంది. ఇతర సేవలతో పోలిస్తే కార్గో సేవలు తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎప్పుడూ నష్టాల్లో ఉండే ఆర్టీసీకి కార్గో సర్వీసు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మారాయి. తక్కువ కాలంలోనే కార్గో సేవలు ప్రజలకు చేరువయ్యాయి.
ఆధునిక టెక్నాలజీ
సరుకు రవాణాలో ఆర్టీసీ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. దీంతో వెంటనే సరుకు డెలివరీ చేయగలుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్సిల్స్‌ను రీజినల్ ఆఫీస్‌లోని పార్సిల్ విభాగానికి తరలిస్తారు. అక్కడ వాటికి నంబర్ కేటాయించి నిర్దేశిత ర్యాకుల్లో ఉంచుతారు. వాటిని ఫొటోలు తీసి కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. కస్టమర్ పార్సిల్ తీసుకెళ్లడానికి వస్తే స్కాన్ ద్వారా ఆ పార్సిల్ ఎక్కడుందో తెలిసిపోతుంది. దీంతో కొద్ది నిమిషాల్లోనే తీసి ఇస్తున్నారు. అలాగే పార్సిల్ ట్రాకింగ్ విధానాన్ని కూడా అమలుచేస్తున్నారు.
చార్జి ఎంత అంటే..?
హోం డెలివరీ సేవలకు బుకింగ్ చార్జీలతోచపాటు చిన్న పార్సిల్ కవర్స్ ఒక కిలో వరకు రూ.16.94, వంద కిలోల వరకు రూ.42.38 చార్జ్ చేయనున్నారు. డిమాండ్ ఉండడంతో వరంగల్, కాజీపేట, హన్మకొండ వారందరికీ డోర్ డెలివరీ అందుబాటులోకి తీసుకొచ్చారు. పార్సిల్ వచ్చిన సమాచారాన్ని వెంటనే సంబంధిత వినియోగదారుడికి ఫోన్లో చెబుతారు. వారు తమకు డోర్ డెలివరీ చేయాలని కోరితే నిర్ణీత చార్జి వసూలు చేస్తా రు. చార్జీలు తక్కువగా ఉండ డం వల్ల ఎక్కువమంది ఆర్టీసీ పార్సిల్ వైపు మొగ్గు
చూపుతున్నారు. ఇతర సంస్థల్లా కొరియర్ కవర్లను బుక్ చేసి డోర్ డెలివరీ చేస్తారు. ఆర్టీసీ సర్వీసులు పట్టణాలు, నగరాలతో పాటు మారుమూల పల్లెలకు వెళ్తున్నందున కొరియర్ సర్వీసుకు కూడా ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు.
ఆర్టీసీలో ఇప్పటివరకు కొరియర్ డెలివరీ సేవలు అందుబాటులో లేవు. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణ ప్రజలు హోం డెలివరీ సేవలను వినియోగించుకుని ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీసును ఆదరించాలని, డోర్ డెలివరీ కోసం ఏజెంట్ ఏ హేమంత్‌కుమార్‌ను 9849595333, 7989116834 నెంబర్లలో సంప్రదించాలని ఆర్ఎం కోరారు.
కార్గో సేవల్ని ఆదరించాలి..
ఆర్టీసీ పార్సిల్ సేవలు ఇప్పటికే వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రజలకు తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలతో పాటు ఆర్టీసీ కార్గో పార్సిల్ ఏజెంట్ల ద్వారా ఎక్కడ బుక్ చేసినా హోం డెలివరీ చేస్తాం. సేవలను వినియోగించుకుని కార్గో సర్వీసును ఆదరించాలి.