హనుమకొండ, మే 5: కార్మికులకు గులాబీ పార్టీ అండగా నిలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు కార్మికులను సైతం కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ప్రభుత్వం సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. కానీ, ఇందుకు భిన్నంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ, కార్మికుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రం కాలరాస్తూ, బహుళజాతి సంస్థల కోసం పనిచేస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు సంఘటిత, అసంఘటిత కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం మే నెల అంతా కార్మిక చైతన్య మాసోత్సవం జరిపేందకు నిర్ణయించారు. అలాగే, 31వ తేదీన ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను చట్టాల సవరణ పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. 29 చట్టాలను రద్దు చేస్తూ 4 కొత్త కోడ్లు తీసుకొచ్చిందని, దీంతో కార్మికులు హక్కులు కోల్పోవాల్సి వస్తుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంతకుముందు ఉన్న కనీస వేతన సవరణ చట్టం పోయి యాజమాన్య వేతన చట్టం వస్తుందని, యాజమాన్యాల నిర్ణయాలపై ఆధారపడి కార్మికులు బతకాల్సి ఉంటుందంటున్నారు. భెనిఫిట్స్ సైతం రాకుండాపోతాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 గంటలు పనిచేయగా.. ప్రస్తుతం పనిగంటల సమయం 10 నుంచి 12 గంటలకు పెరిగిందంటున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మకానికి పెట్టి కార్మికుల హక్కులను కాలరాస్తోందని పలవురు మండిపడుతున్నారు. మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ హక్కులను పరిరక్షించేందుకు పోరాటాలు చేస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికులకు హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. మే నెలంతా కార్మిక చైతన్యం మాసం నిర్వహిస్తున్నాం. ఇందుకు కార్మికులు, కార్మిక సంఘాల నాయకలతో కలిసి చర్చించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. అందులో భాగంగా ఈ నెల 1న కార్మిక కూడళ్లలో పెద్ద ఎత్తున జెండాలు ఎగురవేసే కార్యక్రమం చేపట్టాం. 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. 16 నుంచి 30 వరకు సభలు, సమావేశాలు నిర్వహిస్తాం. అలాగే ప్రొఫెషనల్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. నిర్వహంచనున్నాం. చివరి రోజు 31న నగర పరిధిలో కార్మికులతో భారీ బహిరంగ సభ ఉంటుంది. కార్యాచరణలో భాగంగా కార్మికుల పనివేళలు, ఉద్యోగ భద్రత, బెనిఫిట్స్, ఓటీ, సెలవులు తదితర అంశాలను వివరిస్తాం. కార్మికులు ఒక సంఘటిత శక్తిగా ఎదిగేందుకు ఈ కార్మిక మాసోత్సవం నిర్వహిస్తున్నాం. నగరంలో ఇండ్లల్లో పని చేసే వారి నుంచి మొదలుకుని కార్పొరేషన్, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వారికి న్యాయం చేస్తాం. పనిచేసే ప్రాంతాలు, నివసించే ప్రదేశాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో సభలు, సమావేశాలు నిర్వహించి కార్మికులను చైతన్యపరుస్తాం. కేంద్ర ప్రభుత్వం కుఠిల రాజకీయం చేస్తూ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోంది. కార్మికుల్లో స్ఫూర్తి నింపి చట్టాలు రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తాం.
– దాస్యం వినయ్‌భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్