Meena | సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ ప్రజల ముందే ఉంటాయి. అయితే వెలుగుల వెనుక దాగి ఉన్న వ్యక్తిగత బాధలను చాలామంది గుర్తించరు. తాజాగా సీనియర్ నటి మీనా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మీనా రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఆ వార్తలు క్షణాల్లో వైరల్ కావడంతో అభిమానులు, సన్నిహితులు కూడా ఫోన్ చేసి ఈ విషయం నిజమా కాదా అని అడగడం మొదలుపెట్టారు. దీంతో సహనం కోల్పోయిన మీనా ఈసారి గట్టిగానే స్పందించారు. కాగా, 2022లో భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్యలతో మరణించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ మీనా భావోద్వేగానికి గురయ్యారు. “ఆ బాధ నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. ప్రస్తుతం నా కూతురే నా ప్రపంచం. ఆమె కోసమే నేను స్ట్రాంగ్‌గా నిలబడుతున్నాను” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
భర్త మరణించిన కొన్ని రోజులకే తనపై పెళ్లి పుకార్లు రావడం ప్రారంభమైందని, అయితే అప్పట్లో వాటిని పట్టించుకోలేదని చెప్పారు. “నా మౌనాన్ని బలహీనతగా తీసుకుంటే ఎలా?” అంటూ ప్రశ్నించారు. తాను ఒక సెలబ్రిటీ మాత్రమే కాదు, భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళనని గుర్తు చేస్తూ మీనా మండిపడ్డారు. “నేను ఒంటరి మహిళను కాబట్టే ఇలా ఈజీగా టార్గెట్ చేస్తున్నారా?” అంటూ ప్రశ్నించారు. ఈ రూమర్లను ఇప్పటికే పలుమార్లు ఖండించినప్పటికీ, మళ్లీ మళ్లీ అదే వార్తలు రావడం తనను బాధిస్తున్నాయని తెలిపారు. ఫ్రెండ్స్ కూడా పెళ్లి గురించి అడగడం తన గుండెను మళ్లీ మళ్లీ గాయపరుస్తోందని, ఇలాంటి ఫేక్ వార్తలు తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో పుకార్లు అరుదుగా వచ్చేవని, ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఒక అబద్ధం కూడా క్షణాల్లో ప్రపంచమంతా పాకి నిజంలా మారిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. “నేను చాలా పాజిటివ్ వ్యక్తిని. ఇకపై ఇలాంటి విషయాలపై నా టైమ్, ఎనర్జీ, ఆరోగ్యాన్ని వృథా చేసుకోను. కర్మ అనేది ఒకటి ఉంటుంది… అది ఎవ్వరినీ వదిలిపెట్టదు” అని స్పష్టం చేశారు. మీనా చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై హద్దులు దాటి వస్తున్న రూమర్లపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికైనా మీనా విషయంలో ఈ తప్పుడు ప్రచారం ఆగుతుందా? అన్నది చూడాలి.