గీసుగొండ, మే 4: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు దేశంలోనే నంబర్‌వన్‌గా ఆవిర్భవించనుందని, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృఢ సంకల్పంతో రాష్ర్టానికి అనేక పరిశ్రమలు క్యూ కడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ నెల 7న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గీసుగొండ, సంగెం మండలాల్లోని టెక్సటైల్ పార్కులో నిర్మాణం పూర్తి చేసుకున్న గణేశా ఇకోపెట్ టెక్ వస్త్ర పరిశ్రమ ప్రారంభం, కైటెక్స్ వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికుల పరిశ్రమలకు భూమిపూజ, యంగ్వన్ పరిశ్రమలకు కేటాయించిన 263 ఎకరాల స్థల పరిశీలన, అనుమతి పత్రాలను అందించేందుకు మంత్రి కేటీఆర్ రానున్నారు. ఈ సందర్భంగా బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ బీ గోపి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్కును సందర్శించారు. కేటీఆర్ రాక కోసం పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కులో హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో ఈ ప్రాంతానికి టెక్స్టైల్ పార్కు మంజూరైందన్నారు. భవిష్యత్‌లో ఈ ప్రాంతం మహానగరం కానుందని, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ. 300 కోట్లతో పార్కులో విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, నీటి వసతి కల్పించిందన్నారు. పార్కు నుంచి గీసుగొండ, సంగెం మండలాలకు వెళ్లేందుకు వై జంక్షన్, ఆర్వోబీ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. పార్కులో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు వంద గజాల చొప్పున 45 ఎకరాల స్థలం పార్కులోనే ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే, వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. భూములు కోల్పోయిన రైతులు బాధపడొద్దని, తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కైటెక్స్ గార్మెంట్స్ పరిశ్రమ రావడం వల్ల ఈ ప్రాంతంలో పత్తి పండించే రైతులు లాభపడుతారని తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ కారిడార్‌గా రూపాంతరం చెందనుందన్నారు.
కేసీఆర్, కేటీఆర్‌కు రుణపడి ఉంటాం
ఈ ప్రాంత ప్రజల తరఫున సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వారికి రుణపడి ఉంటామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోద్భలంతోనే ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కు వచ్చిందన్నారు. ఇక్కడి నుంచే దేశం మొత్తం వస్ర్తాలను సరఫరా చేసే పరిశ్రమలు రాబోతున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఒక్క కైటెక్స్ పరిశ్రమలోనే 12,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. వారికి కంపెనీయే శిక్షణ ఇచ్చి తీసుకుంటుందని, శిక్షణ కాలం నుంచి వేతనాలు, భోజన వసతి కల్పిస్తారని చెప్పారు.
మహిళలకే 80 శాతం ఉద్యోగాలు
కైటెక్స్ వస్త్ర పరిశ్రమను 180 ఎకరాలు, రూ. 12,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి మనోజ్ తెలిపారు. 2023 జనవరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి కంపెనీని ప్రారంభిస్తామని చెప్పారు. దేశం మొత్తానికి ఇక్కడి నుంచే దుస్తులను సరఫరా చేస్తామన్నారు. కంపెనీలో 80 శాతం ఉద్యోగాలను మహిళలకే అందిస్తామని చెప్పారు. కంపెనీలో రోజూ 8 గంటలపాటు పని ఉంటుందని, కంపెనీలోనే భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం, మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇండస్ట్రియల్ పాలసీ ఎంతో నచ్చిందన్నారు. తాము ఇక్కడ తక్కవ సమయంలోనే పరిశ్రమను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.
దేశంలో ఇదే మొదటి పరిశ్రమ..
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ నుంచి దారం తీసి వస్ర్తాలను తయారు చేసే పరిశ్రమ దేశంలో ఇదే మొదటిదని గణేశా ఇకోపెట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్కండేల్వల్ తెలిపారు. దేశం మొత్తం నుంచి ప్లాస్టిక్ వేస్ట్ బాటిళ్లను సేకరించి వాటి ద్వారా చీప్స్, దుస్తులకు అవసరమయ్యే గుండీలు, బాస్కెట్‌బాల్ క్లాత్‌లు తదితర అనేక రకాల మెటీరియల్ తయారవుతాయని వివరించారు. పరిశ్రమ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ అనేది ఉండదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ప్లాస్టిక్‌ను సేకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ బీ గోపి, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, ఆర్డీవో మహేందర్‌జీ, డీసీపీ కే వెంకటలక్ష్మి, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఏసీపీ నరేశ్‌కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.