నయీంనగర్, ఏప్రిల్ 13: దళిత బంధు పథకం దేశానికి దిక్సూచి అని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్ధన్నపేట గ్రేటర్ వరంగల్ పరిధిలోని మునిపల్లి, భట్టుపల్లి, కొత్తపల్లి, చింతగట్టుకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే అరూరి ప్రశాంత్‌నగర్‌లోని తన నివాసంలో బుధవారం ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు అందిస్తున్న గొప్ప మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దళితుల్లో నెలకొన్న తారతమ్యాలను రూపుమాడమే దళిత బంధు పథకం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేసుకుని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.