Afghanistan : తాలిబన్ల (Talibans) ఏలుబడిలో ఉన్న అఫ్గానిస్థాన్ (Afghanistan) లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ మహిళల హక్కుల (Women rights) ను కాలరాస్తూ.. ఎప్పటికప్పుడు అమానవీయ నిబంధనలను తీసుకువస్తున్నారు. తాజాగా మహిళలు, పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తూ అరాచక చట్టాన్ని తెచ్చారు. ఇంట్లో పురుషుడి దాడిలో స్త్రీ ఎముకలు విరిగితేనే అది గృహహింస (Domestic Violence) అవుతుందని, లేదంటే అది నేరమే కాదని పేర్కొంటూ గృహహింసను చట్టబద్ధం చేసింది.
బయటికి గాయం కనిపించకుండా, రక్తస్రావం కాకుండా ఇంట్లోని మగవారు మహిళలను శారీరకంగా హింసించినా అది శిక్షార్హం కాదని కొత్త చట్టం చెబుతోంది. ఈ కొత్త నిబంధనలపై అఫ్గాన్ సుప్రీం లీడర్ హిబుతుల్లా అఖుంద్జాదా సంతకాలు చేశారు. ఈ చట్టం ప్రకారం ఒకవేళ పురుషుడు క్రూరంగా ప్రవర్తించడంవల్ల స్త్రీ ఎముకలు విరిగితే, గాయం బయటికి కనపడితే శిక్షపడుతుంది. అయితే ఆ శిక్ష కేవలం 15 రోజులు మాత్రమే కావడం గమనార్హం. అది కూడా తాను గృహహింసకు గురయ్యాయని మహిళ కోర్టులో నిరూపించగలిగితేనే.
బాధిత మహిళ ఇలాంటి ఫిర్యాదు చేసేందుకు కోర్టుకు వెళ్లినప్పుడు వెంట ఆమె బాధ్యత చూసుకొనే పురుషుడు ఉండాలట. అలాగే న్యాయమూర్తికి ఆమె తన గాయాలను చూపించేటప్పుడు దుస్తులతో పూర్తిగా కవర్ చేసుకొనే ఉండాలట. భర్త భార్యను కొట్టి నేరం రుజువైనా 15 రోజుల శిక్ష అట. అదే ఒక వివాహిత తన భర్త అనుమతి లేకుండా బంధువుల వద్దకువెళ్తే మూడు నెలల జైలుశిక్ష పడుతుందట. ఈ కొత్త శిక్షాస్మృతిలో ఆర్టికల్ 9 ప్రకారం.. అఫ్గాన్ సమాజాన్ని నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.
మత పెద్దలు (ఉల్మా), ఉన్నతవర్గం (అష్రాఫ్), మధ్యతరగతి, దిగువ తరగతిగా సమాజాన్ని విభజించారు. ఈ మేరకు కొత్త పీనల్ కోడ్ ప్రకారం.. నేర తీవ్రతను బట్టి కాకుండా ఆయా వర్గాలను బట్టి శిక్షలు ఉంటాయి. 2009లో అప్పటి అఫ్గాన్ ప్రభుత్వం మహిళలపై హింసకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాన్ని ఈ కొత్త పీనల్ కోడ్ రద్దు చేసింది. 2021లో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు అధికారంలోకి వచ్చారు. అప్పటినుంచి మహిళల హక్కులను హరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.