AI Impact Summit 2026 : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఏఐ వినియోగం చట్టబద్ధంగా, పునఃసమీక్షించేలా ఉండాలని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు (India AI Impact Summit)’ లో గురువారం ప్రధాని ప్రసంగించారు.
మానవ అభివృద్ధిలో ఏఐ కీలక భూమిక పోషిస్తోందని ప్రధాని తెలిపారు. మేకిన్ ఇండియా, భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఈ సదస్సు చాటుతోందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఆరోవంతు జనాభా భారత్‌లోనే ఉందని, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోందని చెప్పారు. కృత్రిమ మేథను ఉపయోగించుకోవడంలో దేశ యువత ఆసక్తి కనబరుస్తోందని తెలిపారు. భారత్‌లో ఏఐ పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తుందన్నారు.
కృత్రిమ మేథకు పరివర్తన శక్తి ఉందని ప్రధాని చెప్పారు. దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుందని, అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు చూపుతుందని అన్నారు. మనుషులు, సాంకేతికత కలిసి అభివృద్ధి పయనం సాగించే శకంలో మనం ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదో కాదు.. ప్రస్తుతం కృత్రిమ మేథను ఉపయోగించి మనం ఏం చేయగలమనేదే అసలు ప్రశ్న అని అన్నారు.
ప్రజా సంక్షేమం, శ్రేయస్సే ఏఐకి మన బెంచ్‌మార్క్‌లు అని, మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం అవ్వాలని ప్రధాని అన్నారు. కృత్రిమ మేథ మనలను శాసించకూడదని, మనమే ఏఐని శాసించాలని మోదీ చెప్పారు. కృత్రిమ మేథ వినియోగంలో ‘మానవ్ (MANAV) విజన్’ ఉండాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విజన్ అర్థం, ఫ్రేమ్‌వర్క్‌ను ఆయన వివరించారు.
M – మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్ : నైతిక విలువలు, బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ఏఐ వ్యవస్థలకు మార్గనిర్దేశనం చేయాలి.
A – అకౌంటబుల్ : పారదర్శక నిబంధనలతో, జవాబుదారీతనంతో ఏఐ వ్యవస్థలు పనిచేయాలి.
N – నేషనల్ సావర్నిటీ : ఒక దేశంలో సృష్టించిన డేటా ఆ దేశానికే చెందాలి. ఆ దేశ పరిధిలోనే ఉండాలి.
A – యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ : ఏఐ వ్యవస్థలు గుత్తాధిపత్యంతో పనిచేయకుండా అన్ని వర్గాల వారికీ అందుబాటులోకి రావాలి.
V – వ్యాలిడ్ అండ్ లెజిటిమెట్ : ఏఐ చట్టబద్ధంగా, విశ్వసనీయమైనదిగా పనిచేయాలి. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. అని ప్రధాని మోదీ చెప్పారు.