నర్సంపేట, మార్చి 23: కల్యాణలక్ష్మి పథకానికి మూల కారణమైన ఆ కుటుంబంలో ఆడబిడ్డ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పెళ్లి పెద్దగా మారారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే వివాహం జరిపించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి 9.20గంటలకు ముహూర్తం ప్రకారం వధూవరులు చంద్రకళ, చందర్ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
20 ఏండ్ల కిందట ఓ మారుమూల తండాలో బిడ్డ పెండ్లి కోసం ఓ తండ్రి దాచుకున్న డబ్బు అగ్నికి ఆహుతైంది. 2002 మార్చిలో జరిగిన ఈ ప్రమాదాన్ని తెలుసుకొని ఇప్పటి ములుగు జిల్లా కొడిశల కుంట సమీపంలోని భాగ్య తండాకు వెళ్లిన నాటి ఉద్యమ నేత కేసీఆర్ ఆ ఆడపిల్ల తండ్రి కీమానాయక్ను చూసి కంట తడి పెట్టుకున్నారు. కీమానాయక్ కూతురు కల్పన పెండ్లికి అవసరమైన నగదు, బంగారం కాలిబూడిదైన విషయాన్ని తెలుసుకొని సీఎం కేసీఆర్ కల్పన వివాహ బాధ్యతలను భుజాన వేసుకొని పెండ్లి ఖర్చులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం చేశారు. అన్ని వసతులు సమకూర్చి తానే దగ్గరుండి పెండ్లి జరిపించారు. అప్పుడు బిడ్డ పెళ్లికి తండ్రి పడిన వేదన నుంచే అధికారంలోకి వచ్చాక కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. నాడు కల్పన పెండ్లి ద్వారా పునాది పడిన ఈ పథకం ఇవాళ ఆమె కూతురు చంద్రకళ పెండ్లికి అక్కెరకు వస్తున్నది. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లికి చెందిన కల్పన కూతురు చంద్రకళ వివాహానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం అండగా నిలిచింది. ఈ నెల 24న రాత్రి 9.20 గంటలకు ముహూర్తం ప్రకారం వధూవరులు చంద్రకళ, చందర్ వివాహం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న కాన్ఫరెన్స్హాల్లో వైభవంగా జరుగనుంది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. సొంత ఖర్చులతో వివాహాన్ని దగ్గరుండి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతోపాటు ప్రతి ఒక్కరూ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించేందుకు ఏర్పాట్లు చేశారు. వివాహానంతరం విందును కూడా ఈ నెల 25న మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే నిర్వహించనున్నారు.