Delhi woman : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక మహిళ పసి బాలుడిని గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలోని, ముఖర్జీ నగర్ ప్రాంతంలోని ఒక పార్కులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. నిందితురాలిని అజ్రా (30)గా, బాలుడిని హది (1.9 ఏళ్లు)గా గుర్తించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం పార్కులో 1.9 ఏళ్ల వయసున్న హది అనే బాబుని ఆమె మేనత్త అజ్రా ఒళ్లో పడుకోబెట్టుకుని ఉంది.
అయితే, బాబును ఆడించకుండా గొంతు పిసికి ఊపిరాడకుండా చేసింది. గట్టిగా గొంతు నులుముతూ చంపడానికి ప్రయత్నించింది. చాలాసేపు ఆమె ఇలాగే చేస్తుండటంతో అక్కడే గార్డెనింగ్ వర్క్ చేస్తున్న మహిళ గుర్తించి, పార్కులో ఉన్న ఇతరుల్ని పిలిచింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి, ఆ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఆమె దగ్గరి నుంచి బాబును లాక్కున్నారు. కానీ, ఈలోపే ఆమె చిన్నారి గొంతు నులిమేసింది. చిన్నారిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాబు మరణించాడని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వచ్చే సరికి నిందితురాలు స్పృహ లేకుండా పడిపోయి ఉంది.
దీంతో ముందుగా పోలీసులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెను అరెస్టు చేశారు. హది తల్లి ఉజ్మా, తండ్రి అదిల్. వీరిది ఓల్డ్ సీలంపూర్. తల్లి ఉజ్మా బాబును తీసుకుని తన పుట్టింటికి వచ్చింది. ఈ లోపే మేనత్త ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటనపై బాలుడి మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితురాలు పోలీసుల అదుపులో ఉంది. ఆమె ఎందుకు ఈ హత్య చేసిందో తెలుసుకోవడానికి పోలీసులు విచారిస్తున్నారు.