హనుమకొండ చౌరస్తా : బాలల హక్కుల పరిరక్షణ ( Children rights ) కు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి ( Sita Dayakar Reddy ) అన్నారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ , విద్యా, వైద్యారోగ్య, కార్మిక, పోలీస్ శాఖల అధికారులు, బాలల న్యాయ మండలి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
శుక్రవారం ఆయా ప్రాంతాల్లో కమిషన్ పర్యటన సందర్భంగా ఆనేక సమస్యలు గుర్తించామని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలేదని, హనుమకొండ, వరంగల్ డీఈవోలు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో గర్భిణిలు, బాలింతలు, ఇమ్యూనైజేషన్ స్టేటస్ వివరాలను అందించాలని హనుమకొండ డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్యను ఆదేశించారు. బాలల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. త్వరలో బాల్యవివాహ నిషేధ చట్టం, బాల్యవివాహాల నిర్మూలన, పోక్సో చట్టంపై పెద్దఎత్తున అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో బాలల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీని ద్వారా వారి మానసిక వికాస స్థాయిలను గుర్తించి అవసరమైన వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించే చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, బండి అపర్ణ, కంచర్ల వందనగౌడ్, వచన్ కుమార్, ప్రేమలత అగర్వాల్, డీఆర్వో వైవీ గణేష్, ఆర్జేడీ ఝాన్సీ లక్ష్మీబాయి, జిల్లా సంక్షేమ అధికారులు విశ్వజ, మల్లీశ్వరి,అడిషనల్ డీసీపీ ఎన్.రవి, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.