వృద్ధులు, దివ్యాంగులు, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి
పోస్టర్ల ఆవిష్కరణలో కలెక్టర్ గోపి
ఖిలావరంగల్, మార్చి 21: వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 14567ను వినియోగించుకోవాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన వృయోవృద్ధులు, దివ్యాంగుల హెల్ప్‌లైన్ నంబర్ల వాల్‌పోస్టర్లు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారం, సలహాల కోసం 18005728980 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కుటుంబ సభ్యుల నుంచి రక్షణ, పోషణ, న్యాయపరమైన సలహాలు, సూచనలు, పెన్షన్ ఆధారిత సమస్యలు, భావోద్వేగాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను ఉచితంగా పొందేందుకు హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ప్రతి రోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, ఆర్డీవో మహేందర్‌జీ, జిల్లా అధికారులు, సఖీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ 52 ఫిర్యాదులు స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీవత్సవ పాల్గొన్నారు. అంతేకాకుండా కలెక్టరేట్ ఆవరణలో సఖీ కేంద్రం వాహనాన్ని గోపి ప్రారంభించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 181 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ పాల్గొన్నారు. అలాగే, వరంగల్ అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం భవనాన్ని ఆక్రమించుకొన్న ఎం చందర్రావు కుటుంబాన్ని వెంటనే ఖాళీ చేయించి తమకు భవనాన్ని అప్పగించాలని కోరుతూ జిల్లా రైతుల సంఘం నాయకులు కలెక్టర్ గోపికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రైతు సంఘం పేరుతో 831/2013 రిజిస్ట్రేషన్ చేయించామని, విరాళాలు సేకరించి జీ ప్లస్ వన్ భవన నిర్మాణం చేశామని వారు తెలిపారు. చందర్రావుపై గతంలో మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. సంఘం భవనాన్ని కాజేసేందుకు కట్ర చేస్తున్న చందర్రావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, సభ్యులు బరుపటి రవీందర్, ఊరటి హంసాల్రెడ్డి, జెండా అంబయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, జెండా అంబయ్య, రవీందర్, సోమిడి సాంబయ్య ఉన్నారు.