కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడుల్లో బోధన
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం
టీచర్లు శిక్షణను వినియోగించుకోవాలి
జిల్లా పరీక్షల నియంత్రణ అధికారి సృజన్‌తేజ
చెన్నారావుపేట, మార్చి 21: ప్రస్తుత పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించాలంటే ఆంగ్లంపై పట్టు అవసరమని జిల్లా పరీక్షల నియంత్రణ అధికారి ఉండ్రాతి సృజన్‌తేజ అన్నారు. ఆంగ్లంలో బోధించేందుకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు కావాల్సిన మెలకువలపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మండలకేంద్రంలోని సిద్ధార్థ గురుకుల హైస్కూల్లో సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనుందన్నారు. ఇందులో భాగంగానే ఎస్సీఈఆర్టీ, అజీమ్ప్రేమ్జీ యూనివర్సిటీ బెంగళూరు ఆధ్వర్యంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సుపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆంగ్లంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సృజన్‌తేజ వెల్లడించారు. విద్యార్థి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రతి విద్యార్థి ఆంగ్లంపై పట్టు సాధించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్, లింగాపురం హెడ్మాస్టర్ మోహన్‌రావు, మెంటర్స్ యాకయ్య, రాయపురెడ్డి, బాబురావు, ఉపాధ్యాయులు రవీందర్‌రెడ్డి, సురేందర్, ఈర్యా, రమేశ్, పవనకుమారి, శాంతామేరీ, మోహన్‌రావు, వెంకన్న, ఇంద్రారెడ్డి, తిరుపతిరెడ్డి, భానుప్రసాద్, మధు, రియాజుద్దీన్, ఇల్ల సూరయ్య, సీఆర్పీ సంపత్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అశోక్, మెస్సెంజర్ యాదగిరి పాల్గొన్నారు.
‘ఆంగ్లమాధ్యమంలోనే బోధనలు చేయాలి’
నర్సంపేట/నెక్కొండ/గీసుగొండ/సంగెం/పర్వతగిరి: తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినందున ఉపాధ్యాయులు ఆంగ్లంపై పట్టు సాధించి, విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాని నర్సంపేట నోడల్ అధికారి వీ మురళి సూచించారు. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ, ఎస్సీఈఆర్టీల సహకారంతో పట్టణంలోని గీతాంజలి డీజీ స్కూల్లో సోమవారం ఖానాపురం మండల ఉపాధ్యాయులకు మొదటి దఫా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నదని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు ఆంగ్లంలోనే బోధనలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ఐదు రోజుల శిక్షణలో ఉపాధ్యాయులు అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. తదుపరి మూడు వారాలపాటు ఆన్లైన్లో శిక్షణ ఇస్తారని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన టీచర్లకు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ జీ రాంచందర్‌రావు, ఖానాపురం నోడల్ ఆఫీసర్ దూలం రాజేందర్, గీతాంజలి డీజీ స్కూల్ కరస్పాండెంట్ వేములపల్లి సుబ్బారావు, ప్రిన్సిపాల్ ప్రవీణ్, కీ సోర్స్ పర్సన్ సదియా రఫత్, మెంటర్స్ ఎం శ్రీనివాస్, అనిత, శ్రీను, కరుణ, ఎంఈవో రత్నమాల పాల్గొన్నారు. అలాగే, నెక్కొండలోని విద్యోదయ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సు(ఈఎల్‌ఈసీ) శిక్షణ శిబిరాన్ని మానిటరింగ్ అధికారి, ఎంఈవో రత్నమాల ప్రారంభించారు. గీసుగొండ జడ్పీఎస్‌ఎస్‌లో శిక్షణ తరగతులను హెచ్ఎం జ్యోత్స్నప్రభ ప్రారంభించారు. పర్వతగిరిలోని ఉన్నత పాఠశాలలో మానిటరింగ్ ఆఫీసర్ గాయపు లింగారెడ్డి, కోర్సు డైరెక్టర్ ఎండీ జలీల్ తరగతులను ప్రారంభించారు. సంగెం మండలం గవిచర్ల మోడల్ స్కూల్లో శిక్షణకు ఎంఈవో ఎన్ విజయ్‌కుమార్ హాజరయ్యారు.