గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య
వరంగల్, మార్చి 21: నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 14వ డివిజన్లో బాలాజీనగర్, 18వ డివిజన్లోని లెబర్కాలనీ, 41వ డివిజన్ శంభునిపేట, సాకరాశికకుంట, 43వ డివిజన్ రాంగోపాల్పూర్, ఆటోనగర్‌లో పర్యటించి అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులను పరిశీలించారు. కమిషనర్ వెంట సిటీ ప్లానర్ వెంకన్న, సీహెచ్‌వో సునీత, ఈఈ శ్రీనివాస్, డీఈ నరేందర్, రవికిరణ్, ఏఈ హబీబుద్దీన్, కృష్ణమూర్తి ఉన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో 37వ డివిజన్ కార్పొరేటర్ సువర్ణ కమిషనర్‌ను కలిశారు. తూర్పు, మధ్య, పడమరకోట, గిరిప్రసాద్‌నగర్, ఎంఎంనగర్, జంగాలకాలనీ తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. తూర్పుకోటలోని పెద్దమ్మ ఆలయంలో జరిగే జాతరకు సౌకర్యాలు కల్పించాలని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో కొన్ని మార్చాలని కోరారు. అలాగే, ఈ నెల 28, 29వ తేదీల్లో చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు మున్సిపల్ కార్మికులు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సమ్మె నోటీసును కార్మిక సంఘం నాయకుడు సింగారం బాబు నేతృత్వంలో కమిషనర్ ప్రావీణ్యకు అందించారు. కార్మిక సంఘం నేతలు కొత్తకొండ శ్రీనివాస్, రాజారపు భాస్కర్, జన్ను ప్రకాశ్, పోలెపాక కుమార్ పాల్గొన్నారు.