వరంగల్, మార్చి 9: తెలంగాణ ఉద్యమానికి సాహిత్యమే ఊపిరి పోసిందని, వ్యక్తిగత స్వార్థాలు లేకుండా తెలంగాణ సమాజమంతా ఉద్యమంలో భాగస్వాములయ్యారని కేయూ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేశ్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘తెలంగాణ ఉద్యమం సాహిత్యం’ అంశంపై ఒకరోజు సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ సమాజంలోని సమస్యలకు మూలాలు ఆలోచించాలన్నారు. వివక్ష, నిర్లక్ష్యం, అసమానతలే ఉద్యమాలకు దారితీస్తాయని వివరించారు. నిరాక్ష్యరాసులు సైతం ఉద్యమాలు నడిపించిన చరిత్ర ఉందన్నారు. కవులు, కళాకారులు, సాక్షిభూతాలుగా ఉండకూడదని, సమాజ చైతన్యానికి కృషి చేయాలన్నారు. కవి, విమర్శకుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమం సఫలం కావడానికి సైదాంతిక పరమైన అంశాలు తోడ్పాడ్డాయన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ హైదరాబాద్ రాజకీయ రాజధాని అయితే వరంగల్ సాహిత్య రాజధాని అన్నారు. సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడు ఆచార్య బన్నా ఐలయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో డాక్టర్ అంపశయ్య నవీన్, పిల్లలమర్రి రాములు, లావణ్య, బాల శ్రీనివాసమూర్తి, వేటూరి జ్యోతి, చింతకింది ఖాసీం, కాసుల ప్రతాపరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ పత్ర సమర్పణ చేశారు.