
వరంగల్, సెప్టెంబర్ 27(నమస్తేతెలంగాణ) : గులా బ్ తుఫాన్ ప్రభావంతో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురవనున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. కలెక్టర్ బీ గోపి వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చే శారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన దరిమిలా ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, రోడ్లు – భవనాలు, పం చాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది తమ విధుల నిర్వహణలో అలర్ట్‌గా ఉండాలని పేర్కొన్నారు. జిల్లా లో అన్ని చెరువులు ఇప్పటికే దాదాపు పూర్తిగా నీటితో నిండి ఉన్నందున ప్రజలెవరూ వాగులను దాటవద్దని, చెట్ల కింద వాహనాలు నిలుపొద్దని సూచించారు.
తెరిపినివ్వని వాన..
జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుం డా వర్షం కురుస్తున్నది. సోమవారం జిల్లాలో సగటు వర్షాపాతం 128.2 మి.మీ నమోదైంది. ఖానాపురం, నెక్కొండ, గీసుగొండ, చెన్నారావుపేట, నర్సంపేట, దుగ్గొండి, సంగెం మండలాల్లో అధిక వర్షం పడింది. ఖానాపురం, నెక్కొండలో 20.2మి.మీ చొప్పున, గీసుగొండలో 15.8, చెన్నారావుపేటలో 13.6, నర్సంపేట లో 12.2, దుగ్గొండిలో 11.6, సంగెంలో 10.2, నల్లబెల్లిలో 8.8, పర్వతగిరిలో 7.6, వరంగల్‌లో 3.2, వర్ధన్నపేటలో 2.8, రాయపర్తిలో 2 మి.మీ వర్షాపాతం నమోదైంది. వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయారు.
కలెక్టరేట్లో కంట్రోల్‌రూం..
గులాబ్ తుఫాన్ వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున కలెక్టర్ ఆదేశాలతో కలెక్టరేట్లో కంట్రోల్ రూం నిరంతరం పనిచేస్తున్నది. ఇందులో టోల్‌ఫ్రీ నంబర్ 9154252937 ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్టర్ తుఫాన్ ప్రభావంపై స్పెషలాఫీసర్లు, ఆర్డీవోలు, పలు శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. 24 గంటలు అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. వరద నీరు చేరుతుండటంతో చెరువుల పరిస్థితిపై ఆరా తీశారు. చెరువుల కట్టలు తెగకుండా, బుంగ పడితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సూచనలు చేశారు. అలాగే వరద నీరు చేరడంతో ప్రమాదం అంచున ఉన్న ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లోని డీఫ్లోరైడ్ ప్రాజెక్టును సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సం దర్శించారు. తక్షణ మరమ్మతుల కోసం రూ.50వేలు ఎంపీపీకి అందజేశారు. వరద నీరు ప్రాజెక్టులోకి వెళ్లకుండా మళ్లించాలని ఎమ్మెల్యే సూచించారు.
జాగ్రత్తగా ఉండడం మంచిది…
-బీ హరిసింగ్, అదనపు కలెక్టర్
చెరువులు ఇప్పటికే నీటితో నిండి ఉన్నాయి. వరద నీరు రోడ్లు, కాజ్‌వేలపై ప్రవహిస్తున్నప్పుడు ప్రజలు దాటేందుకు ప్రయత్నించొద్దు. చేపలు పట్టేవారు ప్రస్తుతం వాయిదా వేసుకోవాలి. ఈత రానివారు చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. తడిసిన కరంటు స్తంభాలు, వాటి సపోర్టు తీగలను ముట్టుకోవద్దు. శిథిలావస్థకు చేరిన గోడల వద్ద ఉండొద్దు. చెరువుల కట్టలకు ప్రమాదం ఉన్నట్లు తెలిస్తే వెంటనే కలెక్టరేట్లోని టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. తుఫాన్ నష్టాలను కూడా తెలియజేయాలి. అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.