
వరంగల్, సెప్టెంబర్ 21: సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్-2021 పోటీల్లో వరంగల్ నగరాన్ని మొదటి స్థానంలో నిలుపాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి అధికారులు, సఫాయిమిత్ర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్-2021లో పది లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో దేశంలోని 72 నగరాలతో పోటీ పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్నామని, దీన్ని నిలుపుకోవాలని పిలుపునిచ్చారు. సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్ పోటీల్లో ముఖ్యమైన అంశం సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో మంచి మార్కులు సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నెల 30లోగా ప్రజలు సురక్షమిత్ర సురక్షపై తమ అభిప్రాయాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మానవ వ్యర్థాలను యంత్రాలతో సేకరించి అమ్మవారిపేటలోని శుద్ధీకరణ కేంద్రానికి తరలించాలన్నారు. మూడేళ్లకోసారి సెప్టెక్ ట్యాంక్‌లను శుభ్రం చేసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. టోల్‌ఫ్రీ నంబర్ 14420, వాట్సాప్ నంబర్ 9160414420 సమాచారం అందిస్తే సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేస్తారన్నారు. అనంతరం సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనాల కొనుగోలుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను మేయర్, కమిషనర్ లబ్ధిదారులకు అందజేశారు. సమావేశంలో బల్దియా చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జి ఎస్ఈ శ్రీనివాసరావు, కెనరా బ్యాంక్ మేనేజర్ దీక్ష, ఈఈ లక్ష్మారెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు మాదాసి సాంబయ్య, నరేందర్, భాస్కర్, అస్కీ ప్రతినిధులు రాజ్‌మోహన్, అవినాశ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
శుద్ధీకరణ కేంద్రం పరిశీలన
అమ్మవారిపేటలోని మానవ వ్యర్థ్యాల శుద్ధీకరణ కేంద్రాన్ని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య పరిశీలించారు. ప్లాంట్ పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్తగా నిర్మించే 150 కేఎల్డీ సామర్థ్యం కలిగిన ప్లాంట్ స్థలాన్ని పరిశీలించారు. పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఆమె వెంట డీఈ నరేందర్, ఆస్కీ ప్రతినిధి రాజ్‌మోహన్ ఉన్నారు.