
భూపాలపల్లి రూరల్, నవంబర్ 14 :గ్రామాల్లో పల్లె ప్రగతి, హరితహారం, పారిశుధ్యం, ఉపాధి హామీ, ఇంకా ఇతర జీపీ పనులు పక్కాగా నిర్వహిస్తూ ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్ఆర్(డైలీ శానిటేషన్ రిపోర్ట్) యాప్ అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 7గంటల వరకు చేపట్టిన కార్యక్రమ వివరాలను సిబ్బంది ఎప్పటికప్పుడు లైవ్ లొకేషన్ నుంచి సెల్ఫీ తీసి ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరేట్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ యాప్ ద్వారా పల్లెల్లో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. అంతేగాక కార్యదర్శులు, సిబ్బంది సమయపాలన పాటించడమే గాక పనులు త్వరగా పూర్తికానున్నాయి.
డీఎస్‌ఆర్‌లో జిల్లా సమగ్ర సమాచారం
జిల్లాలోని 11 మండలాల్లో 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ యాప్ ద్వారా అన్ని గ్రామాల సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రామస్థాయి సిబ్బంది, అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించడంతో పాటు గ్రామాల్లో అన్ని రకాల పనులు త్వరగా పూర్తిచేసేందుకు ఈ యాప్ దోహదపడుతున్నది. కొన్ని జీపీల్లో కార్యదర్శులు, సిబ్బంది, ప్రజలకు మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్యలు పూర్తయ్యేవి కావు. ప్రస్తుతం ఈ యాప్‌లో ఉదయం 7 నుంచి రాత్రి 7గంటల వరకు ఆయా గ్రామాల్లో నిర్వహించిన విధులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులు సమయానికి వెళ్లి జరుగుతున్న పనులను ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తున్నందున జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, హరితహారం వంటి కార్యక్రమాలు పక్కాగా జరుగుతున్నాయి.
పనుల్లో పారదర్శకత
గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉదయం తాను విధులకు వెళ్లింది మొదలు సాయంత్రం వరకు చేసిన పనులను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ రోజు కార్యదర్శి విధుల్లో లేనట్లు పరిగణిస్తారు. ఒక వేళ మీటింగ్, సెలవుల్లో ఉన్నా సమాచారాన్ని యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. వారు యాప్‌లో సమాచారాన్ని పొందుపరచగానే సిబ్బంది ఎక్కడ ఉన్నదీ లొకేషన్‌తో సహా ఉన్నతాధికారులకు తెలిసిపోతుంది. గ్రామ కార్యదర్శులు చేసిన పనులు ఎంపీడీవో, ఎంపీవో, డీఎల్పీవోలకు పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే పల్లె ప్రకృతి వనం, హరితహారం, కంపోస్ట్ షెడ్లు, శ్మశానవాటికలు, ఉపాధి హామీ పనులు వంటివి డీఎస్ఆర్ యాప్ పర్యవేక్షణలో సాగుతున్నాయి. డీవోఆర్డీలు కూడా నిత్యం గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. వారు గ్రామాలకు వెళ్లిన సందర్భాల్లో ఫొటో అప్లోడ్ చేసి లైవ్ లొకేషన్ పంపుతూ నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. పాత తేదీల్లో తీసిన ఫొటోలు యాప్‌లో అప్లోడ్ చేయాలని చూస్తే అవి అప్లోడ్ కావు.
పర్యవేక్షణ సులభం
గ్రామ పంచాయతీల్లో పారదర్శకంగా పనులు కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. డీఎస్ఆర్ యాప్ ద్వారా కార్యదర్శులు చేపడుతున్న పనులను సులభంగా పర్యవేక్షించవచ్చు. ఈ యాప్ ద్వారా జిల్లాలో చేపడుతున్న పల్లె ప్రగతి పనులు వేగవంతమయ్యాయి. యాప్ వల్ల ప్రజలకు పారదర్శక పాలన అందుతుంది. ఈ యాప్ కార్యదర్శుల బాధ్యతను మరింత పెంచింది.