రీసెర్చ్, ఇన్నోవేషన్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. ఇదీ కే-హబ్ ఉద్దేశం. విద్యార్థులను పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణల వైపు నడిపించేందుకు కేయూలో నిర్మించిన కే-హబ్ నిరుపయోగంగా మారింది. రూ.50కోట్లతో ఏర్పాటుచేసినప్పటికీ పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో ఆవిష్కరణల వైపు ముందడుగు పడడం లేదు. మంత్రులు దీనిని ప్రారంభించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ తెరుచుకోకపోగా పిచ్చిమొక్కలు, మందుసీసాలతో అధ్వానంగా కనిపిస్తున్నది. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తోడ్పడే ఇంక్యుబేషన్ సెంటర్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
– హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 22
కోట్లు ఖర్చుపెట్టి కేయూ క్యాంపస్‌లో నిర్మించిన కే-హబ్ నిరుపయోగంగా మారింది. గతేడాది మార్చి 10న ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు ప్రారంభించినప్పటికీ మౌలిక వసతులు, పరిశోధనలకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండా అధికారులు బిల్డింగ్‌కు తాళాలు వేశారు. అప్పటి నుంచి కే-హబ్‌ను తెరుచుకోకపోవడంతో ప్రాంగణమంతా గడ్డి, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. పరిశోధనలకు కావాల్సిన పక్కా భవనం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర ఎక్విప్మెంట్ కోసం నిధులు సిద్ధంగా ఉన్నా కూడా వర్సిటీ అధికారుల నిర్లక్షం వల్ల పరిశోధనల వైపు అడుగులు పడడం లేదని ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు మండిపడుతున్నారు.
రుసా నుంచి రూ.50 కోట్లు మంజూరు..
రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షాఅభియాన్(రుసా) కింద 2018లో కే-హబ్ మంజూరు చేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం కే-హబ్ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేసింది. రూ.6 కోట్లతో బిల్డింగ్, రూ.9 కోట్లతో మౌలిక వసతులు, రూ.23 కోట్లతో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్, సెంటర్ ఫర్ డ్రగ్ రీసెర్చ్, సెంటర్ ఫర్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్ ఫిజిక్స్, సెంటర్ ఫర్ నానో డ్రగ్ డెలివరీ సిస్టమ్స్, సెంటర్ ఫర్ ఇథ్నో మెడిసినల్ ప్లాంట్స్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కే-హబ్‌కు పక్కా బిల్డింగ్‌తో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇంకా కంప్యూటర్లు, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాల్సి ఉంది.
కే-హబ్ ప్రారంభిస్తే..
కే-హబ్ ప్రారంభిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), బయోడైవర్సిటీ రక్షణ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఫార్మాస్యూటికల్ సైన్స్, జియోలాజికల్ సైన్స్, మైనింగ్, ఇతర రంగాల్లో పరిశోధనలకు అవకాశం ఉంటుం ది. అసాధారణ, విశిష్ఠమైన పరిశోధన అవుట్‌పుట్ కోసం పేటెంట్లు పొందేందుకు ఈ కేంద్రం కోసం వివిధ ఏజెన్సీల నుంచి నిధులను పొందేందుకు కమిటీలు పనిచేస్తాయి. కే-హబ్‌లో అనేక స్టార్టప్ కంపెనీలకు వ సతి కల్పిస్తారు. ఇవేగాక ఇంకెన్నో విభాగాలకు సంబంధించినవి పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణల కోసం విద్యార్థులకు కావాల్సినవి కే-హబ్‌లో సమకూర్చుతారు.
పరిశోధనలు, నాణ్యత మెరుగుదలకు..
కే-హబ్‌లో విద్యార్థులకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు వారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అందించనున్నాయి. కే-హబ్ ప్రారంభమైన తర్వాత కేయూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు టీ-హబ్‌తో చేతులు కలపాలని అధికారులు యోచిస్తున్నారు. విద్యార్థులు హబ్‌లో పరిశోధన, నాణ్యత మెరుగుదల కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. నమూనాలు, ైస్లెడ్లు మొదలైన వాటితో కూడిన సైన్స్ మ్యూజియం, మాన్యుస్క్రిప్ట్‌లు, కళాఖండాలు, గ్రానైట్ శిల్పాలు మొదలైన వాటితో చరిత్ర మ్యూజియం కూడా ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు.
త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం
కే-హబ్ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. విద్యార్థుల నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు, పారిశ్రామికవేత్తలు గా ప్రోత్సహించేందుకు వారికి నైపు ణ్య అభివృద్ధి కార్యక్రమాలను అం దించేందుకు ఎంతో దోహదపడతాయి. రుసా నుంచి మంజూరైన రూ.50 కోట్లను భవ నం, మౌలిక వసతులకు వినియోగించాం. ఇంకా కొన్ని రీసెర్చ్ సెంటర్లకు కూడా అనుమతులు కూ డా వచ్చాయి. కే-హబ్ విద్యార్థులు పరిశోధనలు, నాణ్యత మెరుగుదల కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.
– వల్లూరి రాంచంద్రం, కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్