వర్ధన్నపేట, జనవరి 7: అధికారంలోకి రాగానే దివ్యాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమశాఖ నుంచి వేరు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మాట దాటవేస్తూ దివ్యాంగుల గొంతు కోస్తున్నాడని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ ఆరోపించారు. వికలాంగుల శాఖను ప్రత్యేకంగా ఏర్పా టు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ దివ్యాంగు లు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లిలో గొంతులపై కత్తులు పెట్టుకొని కోసుకుంటామని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భం గా రాజేశ్ మాట్లాడుతూ ఎన్నికల్లో వికలాంగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను మర్చిపోయి వికలాంగులకు తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వెంటనే ది వ్యాంగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ నాయకులు ఎండీ షరీఫ్, ఈదయ్య, బాబు, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.