స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 1: రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాలు, కేజీబీవీ వసతి గృహల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరమున్నదని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని కేజీబీవీ వసతిగృహాన్ని తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో హాస్టల్‌కు వచ్చిన రాజయ్య విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము పడుకునేందుకు బెడ్లు సరిపడా లేవని, ఆడుకునేందుకు గ్రౌండ్ లేదని, భోజనం చేసే హాల్ చిన్నగా ఉండడంతో బయట కూర్చొని తినాల్సి వస్తున్నదని రాజయ్య దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోయిందని, చుట్టూ చెట్లతో ఖాళీ స్థలం ఉందని, విషసర్పాలు, క్రిమీకీటకాలతో ప్రాణాలు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం చేస్తే సహించబోమని, చదువు ఎంత అవసరమో, ఆరోగ్యం కూడా అంతే అవసరమన్నారు. పిల్లలు చెప్పిన సమస్యలపై ప్రభుత్వం, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని రాజయ్య కోరారు.