Tamarind Plant | ప్రకృతిలో నిత్యం ఎక్కడో ఒక చోట ఏదో ఒక వింత జరుగుతుంటుందని తెలిసిందే. అయితే వింత విషయాల్లో కొన్ని మాత్రమే అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి దృశ్యమే ఒకటి జనగామ జిల్లాలో కనిపించింది. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్‌లో చింత మొక్క దానంతట అదే అప్పుడప్పుడు గుండ్రంగా తిరుగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
వివరాళ్లోకి వెళితే.. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ముదిరాజ్ కాలనీలోని నీల గట్టయ్య- రాజమ్మ దంపతుల ఇంటి ఆవరణలో చింత మొక్కలు పెరుగుతున్నాయి. వాటిలో ఓ మొక్క దానికదే తిరుగుతుంది. ఇది గమనించిన స్థానికులు ఏమై ఉంటుందా..? అని ఆశ్చర్యపోతున్నారు. గత మూడు రోజులు క్రితం నీల మణెమ్మ రాఖీ పౌర్ణమి రోజు తమలపాకుల కోసం గట్టయ్య ఇంటికి వెళ్లింది. తమలపాకులు తెంపుతుండగా.. కింద ఉన్న చింత మొక్క దానంతట అదే సవ్య ,అపసవ్య దిశలో తిరగడం చూసిన నీల మణెమ్మ ఆశ్చర్యానికి లోనైంది. వెంటనే మణెమ్మ ఆ ఇంటి వారితోపాటు చుట్టుపక్కల వారిని పిలిచింది. ఎలాంటి గాలి లేకుండానే ఈ చింతమొక్కలలో ఒక చింత మొక్క అటు ఇటు తిరుగుతుందని వారికి చెప్పింది. అక్కడికొచ్చిన వారంతా ఈ విషయాన్ని గమనించి ఆశ్చర్యపోయారు.
అప్పుడప్పుడు అటూ ఇటూ..
మొక్క కింద ఏదో పురుగో, పామో కదలడం వల్ల ఇలా తిరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ చింత మొక్క మూడు రోజులుగా అప్పుడప్పుడు అటూ ఇటూ తిరుగుతుండడంతో ఇది ఏం మాయ అని అనుకుంటూ గట్టయ్య-రాజమ్మ దంపతులు బంధువులను, పండితులను, కాలనీ వాసులను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఏది ఏమైనా చెట్లు ఊగడం చూసాం కానీ గుండ్రంగా తిరగడం ఇదే మొదటిసారి అని, ఈ వింత ఏంటో అనే అయోమయంలో పడుతున్నారు కాలనీవాసులు.
మొన్న ఈ మధ్య కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇలాంటి వింత సంఘటన వెలుగులోకి వచ్చిందని.. అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకోవడం నిజంగా ఆశ్చర్యపోతున్నామని అర్చకులు సైతం వాపోతున్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న వింత సంఘటనలు, పోకడలు బ్రహ్మంగారి చెప్పిన కాలజ్ఞానం ప్రకారం జరుగుతుండొచ్చని అర్చకులు అనుకుంటున్నారు. కొందరు దీనిని దేవుడి లీలగా భావిస్తుంటే,.. మరికొందరు శాస్త్రీయ కారణాలు ఏమైనా ఉండొచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైనా చింత మొక్క ఇలా తిరగడానికి కారణమేంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Dharmasthala: ధర్మస్థలిలో మృతదేహాల వెలికితీత.. డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో గుర్తింపు
RS Praveen Kumar | కోడి గుడ్ల కుంభకోణం రూ. 600 కోట్లు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Gunfire | చందానగర్‌లో దొంగల బీభత్సం.. ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులు