Kadiyam srihari | స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 20 : బీఆర్ఎస్ శ్రేణుల కష్టంపై, కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పీకర్‌కు చెప్పడంతో శనివారం మున్సిపల్ కేంద్రంలోని తిరుమలనాధ స్వామి ఆలయ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి వస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం పలుకుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం అంటూ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఫోటోలతోపాటు బీఆర్ఎస్ శ్రేణులతో కూడిన ప్లెక్సీని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ బీ రాధాకృష్ణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని
తొలగించాలంటూ మున్సిపల్ కమిషనర్ తన సిబ్బందితో వచ్చి ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వారు ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని ఎందుకు తొలగించలేదని, ఇప్పటి వరకు ప్లెక్సీలపై ఎంత ఆదాయం వచ్చింది. ఎంత మంది అనుమతులు తీసుకున్నారో చెప్పాలంటూ మున్సిషల్ కమిషనర్‌ను బీఆర్ఎస్ శ్రేణులు నిలదీశారు. దీంతో ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంటే వివరాలు ఇస్తామని కమిషనర్ చెప్పగా, నిత్యం మున్సిపల్ అభివృద్ధి, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని, రాజకీయాలకు అతీతంగా పని చేయాలని, అధికార పార్టీకి తొత్తుగా పని చేయకూడదని బీఆర్ఎస్ శ్రేణులు మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.
బీఆర్ఎస్ కండువా కప్పుకుని తిరగాలి..
మున్సిపల్ అధికారులు ప్లెక్సీని తొలగించడంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుందని, బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించి బైండోవర్ చేసి సొంత పూచీకత్తుపై వదిలి పెట్టారు. దీంతో పోలీస్ స్టేషన్ ఆవరణలో బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఫోటోలు ఒకే ఫ్లెక్సీలో ఉండడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే కడియం బీఆర్ఎస్ కండువా కప్పుకొని మాచర్ల గణేష్ (బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు) గులాబీ జెండా, బీఆర్ఎస్ కార్యకర్తల శ్రమతో గెలిచిన కడియం తన కూతురు రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి, నేడు నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పీకర్ కు చెప్పిన కడియం ఇకపై బీఆర్ఎస్ కండువా కప్పుకుని నియోజకవర్గంలో తిరగాలని మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ కడియంను డిమాండ్ చేశారు.
ధైర్యం ఉంటే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలి..
కడియంకు ధైర్యం ఉంటే తను ఏ పార్టీలో ఉన్నాడో తనను గెలిపించిన ప్రజలకు చెప్పాలని, ప్రతి రోజు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగడం, స్పీకర్ వద్ద బీఆర్ఎస్ లో ఉన్నానని, నా సభ్యత్వానికి రాజీనామా చేయలేదని పూటకో మాట మాట్లాడడం కడియం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నావో ప్రజలకు స్పష్టంగా చెప్పకపోతే కడియం కార్యక్రమాలను ఆడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటీసీ మారపాక రవి, మాజీ కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్, మాజి ఉప సర్పంచ్ పీ రంజిత్, కుంభం కుమార్, గుండె రంజిత్, పెసరు సారయ్య, ఒగ్గు రాజు, గుండె మల్లేశ్, చిట్టిబాబు, గుర్రం శ్రీనివాస్, ఆకారపు ఆశోక్, బంగ్లా శ్రీనివాస్, శివ, గాదే రాజు, హీఠాసింగ్ తదితరులు పాల్గొన్నారు.\

Brs Party

