మంచిర్యాల, మార్చి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్యాతనపల్లి మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో కాంగ్రెస్ సర్కార్ దిగజారుడు రాజకీయాలు ఆపడం లేదు. పోలీసులు పెట్టిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా బాల్కసుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారంటూ ఆ పార్టీ లీగల్ సెల్, బాల్కసుమన్ ప్యానల్ న్యాయవాదులు వినిపించిన వాదనలతో మంచిర్యాల జిల్లా కోర్టు ఏకీభవించింది. బాల్కసుమన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో, మరో ముగ్గురు బీఆర్ఎస్ నాయకులను శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో అరెస్టుచేసి ఆదివారం రిమాండ్‌కు పంపించారు. ఒకే ఘటనలో రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు క్రైమ్ నంబర్-40లో బాల్కసుమన్ సహా మరికొందరు బీఆర్ఎస్ నాయకులను ఇప్పటికే జైలుకు పంపారు. ఇదే ఘటనపై నమోదు చేసిన రెండో కేసు క్రైమ్ నంబర్ 41లో ఉన్న బీఆర్ఎస్ లీడర్లకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే స్టేషన్ బెయిల్ వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆ కేసులో ఉన్న లీడర్లను కక్షపూరితంగా పోలీసులు క్రైమ్ నంబర్ 40లో చేర్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాల్కసుమన్ అరస్టైన రోజు చార్జిషీట్లో 9 మంది కేసులో ఉన్నట్టు చూపించిన పోలీసులు, ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసు పెట్టినప్పుడు 14మంది ఉన్నట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. తాజాగా మరో ముగ్గురు నాయకులను ఆదివారం కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా మొత్తంగా 25 మంది ఈ కేసులో ఉన్నట్టు చూపించడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా బాల్కసుమన్ ప్యానల్ న్యాయవాది మల్లేశ్‌గౌడ్ కోర్టులో వాదనలు వినిపించారు. బాల్కసుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకుల అరెస్టు, రిమాండ్ తరలింపు అంతా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా జరుగుతుందంటూ వాదనలు వినిపించారు. కోర్టు ఆ ముగ్గురికి 14 రోజుల జ్యుడీషియ ల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో న్యాయవాది మల్లేశ్‌గౌడ్ కోర్టు ముందు మాట్లాడారు. బాల్క సుమన్‌ను అరెస్టు చేసిన సమయంలో రిమాండ్ షీట్లో 9 మంది ఉన్నట్టు పేర్కొన్న పోలీసులు, ఆదివారం 25 మందిని అదే కేసులో చేర్చి, వీరందరినీ ఉద్దేశపూర్వంగానే జైలుకు పంపాలని చూస్తున్నారని తెలిపారు.