జనగామ రూరల్: జనగామ జిల్లాకు (Jangaon) సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాల్సిందేనని రాష్ట్ర గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో జనగామ మండలం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. 350 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల జీవన స్థితి మెరుగుపడాలని, రాజకీయంగా ఎదగాలని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తపించారన్నారు. ఆ మహానుభావుడి ఆనవాలు ఈ నేలపై ఉన్నాయని తెలిపారు. జనగామ జిల్లాకు ‘సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్’ పేరు పెట్టాలని జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 21న రిలే నిరాహార దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని బహుజన కులాల సౌజన్యంతో దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ బహుజన కుల సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ రిలే నిరాహార దీక్షను విజయవంతం చేయాలన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కల్లుగీత వృత్తిదారుల సంఘం అధ్యక్షులు ఐలి వెంకన్న గౌడ్, జనగామ మండల గౌడ సంఘం అధ్యక్షులు నామాల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ అంబాల ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీటీసీ మెరుగు బాలరాజు గౌడ్, జనగామ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ టీసీ దూడల సిద్ధయ్య గౌడ్, సీనియర్ పాత్రికేయులు అగ్రగామి ఎడిటర్ కన్నా పరశురాములు గౌడ్, తెలంగాణ రాష్ట్ర గౌడ రచయితల సంఘం అధ్యక్షుడు గడ్డం మనోజ్ కుమార్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు మార్క ఉపేందర్ గౌడ్, ఎంపీటీసీ తీగల సిద్ధు గౌడ్, నామాల సిద్ధులు గౌడ్, నామాల నరేందర్ గౌడ్ , అంబాల రఘునాథ్ గౌడ్, అంబాల సంపత్ గౌడ్, వగలబోయిన వెంకటేష్ గౌడ్, బత్తిని అశోక్ గౌడ్, మారగోని సిద్దయ్య గౌడ్ అంబాల శివనాథ్ గౌడ్, భైరగోని రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.