హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 23 : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు(Cybercrimes )కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుంకరి జ్యోతి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌కాలేజీలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కాలేజీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను అక్రమంగా కొట్టేస్తున్నారన్నారు.
చదువుకున్నవారు చదువురాని వారు అనే తేడా లేకుండా ఉన్నత హోదాల్లో ఉన్న ఐఏఎస్ క్యాడర్ అధికారులు కూడా సైబర్ మోసాలకు బలవుతున్నారని గుర్తుచేశారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుబేదారి శాఖ మేనేజర్ మౌనిక మాట్లాడుతూ ప్రస్తుతం ఆన్లైన్ లావాదేవీల ద్వారానే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయని, తెలియని లింకులు క్లిక్ చేయకుండా, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ముందుగా స్వయంగా అవగాహన పెంచుకుని గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ అధికారులు శ్రీదేవి, శ్రీలత, చందర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.