తరిగొప్పుల, మార్చి 18: మండలంలోని పలు గ్రామాల్లో నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు(CCTV cameras) పాడైపోవడంతో దిష్టిబొమ్మల్లగా మారినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. నేరాల నియంత్రణకు ప్రజల భాగ్యస్వామ్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణను గాలికొదిలేయడంతో అలంకార ప్రాయంగా మిగిలిపోయాయి. మరమ్మతులు కరువై లక్షల రూపాయల విలువైన పరికరాలు వృథాగా మారుతున్నాయని, దీంతో నిర్వహణ భారంగా మారడంతో వాటిని అలాగే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, మండలంలోని 15 గ్రామ పంచాయతీలో సర్పంచులు, ఎంపీటీసీలు, దాతలు, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాపారుల సహకారంతో గత నాలుగు సంవత్సరాల క్రితం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ, వాటి మహమ్మతుల నిర్వహణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామపంచాయతీలో ప్రత్యేక నిధులు లేకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి వినియోగంలో కి తీసుకురావాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.