సీఎం కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా జనగాం, బచ్చన్నపేటలో విలయతాండవం చేసిన కరువు, కన్నీళ్ల గురించే మాట్లాడుతారని.. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అవి ఆనంద బాష్ఫాలు అయ్యాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జనగాం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభం చేసిన తర్వాత జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.
దేశంలోనే తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రగామిగా చేశారు. అడగకుండానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గొప్పగా చేశారు. వీటిలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం పట్ల వారికి పాదాభివందనం చేస్తున్నాం. గతంలో మేము కలెక్టర్‌ను కలవాలంటే ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ నేడు నూతన జిల్లాల ఏర్పాటు వల్ల పాలన సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. కొత్త కలెక్టరేట్లలో 32 శాఖలను ఒక దగ్గరకు తీసుకురావడం వల్ల ప్రజల కష్టాలు మరింత దూరం అవుతాయి.. అని సత్యవతి రాథోడ్ తెలిపారు.
ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది దానికి ఇదే నిదర్శనం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మిమ్మల్ని చూసి ఓర్వలేక కొంతమంది అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మా తండాలను గ్రామ పంచాయతీలు చేసి, స్వయం పాలన చేసుకునే అవకాశం కల్పించారు. మిమ్మల్ని మా గిరిజనులు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. జనగాం జిల్లా బహిరంగ సభను విజయవంతం చేసిన నాయకులు, శ్రేణులు, ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.