ఖిలావరంగల్, మార్చి 9: పీడీఎస్ బియ్యం కోసం డీలర్లు, ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపులకు అందాల్సిన బియ్యం నెలాఖరుకు చేరుతున్నాయి. రైస్ అలాట్‌మెంట్‌కు సివిల్ సప్లయ్ సిబ్బంది, రేషన్ కోటాకు డీలర్లు, బియ్యం కోసం లబ్ధిదారులు ఇలా ఎవరికి వాళ్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. సివిల్ సప్లయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆరు నెలలుగా బియ్యం సరఫరాలో జాప్యం జరుగుతున్నది.
ముఖ్యంగా వరంగ ల్, ఖిలా వరంగల్, గీసుగొండ మండలాల్లో రేషన్ బియ్యం ఆలస్యంగా పంపిణీ అవుతున్నది. అలాట్మెంట్ ఆలస్యం కావడంతో ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సివిల్ సప్లయి సిబ్బందికి, డీలర్లకు, అలాగే రేషన్ దుకాణాల్లో బియ్యం ఇవ్వకపోవడంతో వినియోగదారులు, డీలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటున్నది. ఎనుమాముల మార్కెట్లోని బఫర్ గోదాంలోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ప్రతి నెల ఈ మూడు మండలాల్లోని 192 రేషన్ దుకాణాలకు పీడీఎస్ బియ్యం సరఫరా చేస్తారు.
ఇందులో వరంగల్ మండలానికి 8,700 క్వింటాళ్లు, ఖిలా వరంగల్‌కు 8,700 క్వింటా ళ్లు, గీసుగొండకు 2600 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రతి నెల 20 నుంచి 1వ తేదీ వరకు డీలర్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అలాగే డీలర్లు 1 నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు బియ్యం పంపి ణీ చేయాలనే నిబంధనలున్నాయి. అయితే బఫర్ గోదాంలో స్టాక్ లేకపోవడంతో రేషన్ షాపుల కు బియ్యం సరఫరా నెలాఖరు వరకు చేరుతున్నదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం ఎప్పుడిస్తారో చెప్పాలంటూ వినియోగదారులు నిలదీస్తున్నారని పేర్కొంటున్నారు.
ఆరు లారీలకు రెండింటితోనే సరఫరా..
బఫర్ గోదాంలో 40 శాతం నిల్వలు ఉన్నప్పుడు రోజుకు అదనంగా ఆరు లారీల పీడీఎస్ బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే, గోదాం ఖాళీగా ఉండడంతో రోజు రెండు లారీలు మాత్రమే వస్తుండడంతో వాటిని 192 షాపులకు సరఫరా చేయడం సాధ్యం కావడం లేదు. ఒక డీలరుకు ఒకేసారి కోటాను అందించాల్సి ఉండగా స్టాక్ లేకపోవడంతో రెండు సా ర్లు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. లారీలు రావడం తో డీలర్లు మాకే ఇవ్వాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం సరఫరాపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సకాలంలో బియ్యం అందడం లేదని వి నియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 రో జుల్లో రేషన్‌షాపుల్లో బియ్యం పంపిణీ పూర్తి చేయాల్సి ఉండగా నెల రోజులు ఎదురు చూడాల్సిన వస్తున్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి సకాలంలో బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.