Harish Rao | తెలంగాణకు పట్టిన గ్రహణం సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు అన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వంతో పోరాటం చేసి ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ సెక్రటరీ చుట్టూ తిరిగి వెంటపడి 30 రోజులకి ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయించుకొని మోటర్లు రిపేర్ చేయించారని తెలిపారు. 33 రోజులు మోటర్లు బాగు చేసి భీమఘన్పూర్ నింపుకొని, చలి వాగు నింపుకొని, ధర్మసాగర్ నింపుకొని, గడ్డి రామారం నింపుకొని, బొమ్మకూరు నింపుకొని, తపాస్‌పల్లి దాకా నీళ్లు తెచ్చుకునే వాళ్లమని అన్నారు. ఇప్పుడు మోటార్ ఆన్ చేసినా నీళ్లు అందని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక వరంగల్ జిల్లాలోనే లక్ష ఎకరాలు ఎండిపోతున్నాయి అంటే.. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ రెడ్డి చేతకానితనం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. కృష్ణానదిలో రేవంత్ రెడ్డి గురువు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీళ్లు దోచుకుంటుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉన్నారని.. ముఖ్యమంత్రి మాట్లాడలేదని మండిపడ్డారు. ప్రజాభవన్‌కు చంద్రబాబు నాయుడిని పిలిచి ఆయన అడుగులకు మడుగులు ఒత్తింది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. చంద్రబాబును ప్రశ్నించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో కుటుంబసమేతంగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చాడని అన్నారు.
రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడు కాబట్టే ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కూడా పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు నల్గొండ, మహబూబ్‌నగర్‌లో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా కృష్ణానది జలాలను దోచుకోవడమే కారణమని తెలిపారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల, మోటార్లు సకాలంలో ఆన్ చేయకపోవడం వల్ల నీళ్లు రావడం లేదని అన్నారు. దేవాదుల ఫేజ్ 3 కూడా పూర్తయిందని.. ఫేజ్ 3 మోటార్ ఆన్ చేస్తే కూడా ఇంకెక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. 60 , 70 శాతం పంటలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడిందని.. ఈ జిల్లా కాంగ్రెస్ మంత్రులు, నాయకులు పట్టించుకోరా? రివ్యూ చేయరా? అని ప్రశ్నించారు. లక్ష ఎకరాల్లో పంట ఎండిపోతుంటే కాంగ్రెస్ నాయకులకు చీమ కుట్టినట్టయినా లేదా అని నిలదీశారు. వెంటనే దేవాదుల ఫేజ్ 3 మోటార్లను ప్రారంభించి పంట పొలాలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. వానకాలం రైతుబంధు ఎగ్గొట్టినవ్, యసంగి రైతుబంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, ఎరువుల తిప్పలు పోలేదు, మోటార్లు కాలిపోతున్నాయి. ఇంకా 400 కోట్ల రూపాయల సన్న వడ్ల బోనస్ పెండింగ్ ఉన్నాయి. యాసంగి పంట కోతకొచ్చినా ఇప్పటికీ వానకాలం పంట బోనస్ డబ్బులు ఇంకా రైతులకు పడలేదని మండిపడ్డారు.