రాయపర్తి, ఏప్రిల్ 18 : మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై పోలీసులు 5క్వింటాళ్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రాయపర్తి పోలీస్ స్టేషన్లో వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై సోమవారం ఎస్సై బండారి రాజు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఖమ్మం నుంచి వరంగల్‌కు వెళ్తున్న కారును ఆపి సోదా చేయగా, 20 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు లభించాయి. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరిని విచారించారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా గోలిగొండ మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన పోలిరెడ్డి గంగరాజు, నర్సిపట్నం మండలం గబ్బడ గ్రామానికి చెందిన రాతాల నానాజీగా గుర్తించారు. అలాగే, మరో భారీ వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈక్రమంలో గంజాయి లోడుతో వస్తున్న లారీని (గ్రానైట్ రవాణా చేసే లారీ) గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, డ్రైవర్ అప్పికొండ శివ, మెకానిక్ అడపారెడ్డి కిశోర్ పోలీసులను చూసి పారిపోయారు. 500 కిలోల ఎండు గంజాయిని తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ సమక్షంలో పంచనామా నిర్వహించినట్లు చెప్పారు.
అక్రమార్కులు గంజాయిని పుష్ప సినిమా తరహాలో లారీలో ప్రత్యేకంగా అరలు అమర్చి తరలిస్తున్నారు. గ్రానైట్ లారీని సమకూర్చుకున్న సదరు వ్యక్తులు నర్సిపట్నంలో 480 కిలోల ఎండు గంజాయిని 20 కిలోల చొప్పున తయారు చేయించి మొత్తం 240 ప్యాకెట్లను తరలించేందుకు లారీలో ప్రత్యేక అరలను ఏర్పాటు చేసుకున్నట్లు డీసీపీ సీతారాం వెల్లడించారు. లారీ బాడీని లిఫ్ట్ సహాయంతో పైకి ఎత్తి టైర్ల పై ప్రాంతంలో ప్రత్యేకంగా షెల్ఫ్‌లను తయారు చేసుకుని గంజాయి ప్యాకెట్లను అందులో అమర్చి రవాణా చేస్తున్నట్లు వివరించారు. గంజాయి విలువ సుమారు రూ.50లక్షలు, లారీ, కారు విలువ సుమారు మరో రూ.50లక్షలుగా ఉంటుందని చెప్పారు. పట్టబడిన ఇద్దరు వ్యక్తులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గంజాయిని పట్టుకున్న ఎస్సై రాజు, సిబ్బందిని అభినందించారు. వర్ధన్నపేట ఇన్స్పెక్టర్ గడ్డం సదన్‌కుమార్, ఏఎస్సై సదయ్య, సిబ్బంది తూళ్ల సంపత్‌కుమార్, కత్తుల శ్రీనివాస్‌యాదవ్, బండారి మహేందర్, చిదురాల రమేశ్, బొట్ల రాజు, సోమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.