రూ.18 లక్షలు ఇచ్చిన బాధితుడు
‘బాబా’ పేరుతో మోసం
టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
మహబూబాబాద్, ఆగస్టు 21 : ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాంటూ టీవీలో వచ్చిన యాడ్ చూసి రూ.18లక్షలు సమర్పించుకున్నాడు పట్టణానికి చెందిన ఓ యువకుడు. టౌన్ సీఐ జూపల్లి వెంకటరత్నం, బాధితుడు మహ్మద్ రజాక్ తెలిపిన వివరాల ప్రకారం…. మహబూబబాద్ మసీదు సెంటర్లో టీ అమ్ముకునే మహ్మద్ రజాక్-హబీబా దంపతులు ఓ చానల్లో బాబా జాఫర్‌ఖాన్ పేరిట వస్తున్న కార్యక్రమాన్ని చూశారు. ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరిస్తామని, ఎవరికైనా సమస్య ఉంటే తమ నంబర్‌కు ఫోన్ చేయాలని స్క్రోలింగ్‌లో చూపించారు. అది నమ్మిన దంపతులు తాము కొందరికి రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చామని, వారు తమ డబ్బులు చెల్లించకపోగా ఇబ్బంది పెడుతున్నారని బాబాకు వివరించారు. దీనిని ఆసరాగా చేసుకున్న బాబా వారిపేరున పూజ చేస్తే మీ డబ్బులు మీకు వస్తాయని నమ్మించాడు. పూజ కోసం కొన్ని డబ్బులు తన అకౌంట్లో వేయాలని సూచించడంతో బాబాజాఫర్ఖాన్ అకౌంట్లో జమ చేశారు. అయినా, అప్పు తీసుకున్న వారు డబ్బులు చెల్లింకపోవడంతో తిరిగి బాబాకు ఫోన్ చేశారు.
మరోసారి పూజ చేయాలని మరికొంత డబ్బు పంపించాలని చెప్పగా అతడి ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఇలా 2020 సెప్టెంబరు 16 నుంచి 2021 ఫిబ్రవరి వరకు రూ. 18 లక్షల జమ చేశారు. అయినా, అప్పు తీసుకున్న వారు డబ్బులు చెల్లించకపోవడంతో బాబాకు ఫోన్ చేయగా స్వీచ్చాఫ్ వచ్చింది. మరో ఫోన్ నంబర్‌తో చేయగా హైదరాబాద్‌లో ఉన్న తన ఆఫీసుకు రావాలని రజాక్ దంపతులకు చెప్పాడు. దీంతో వారు అతడి అడ్రస్‌కు వెళ్లగా అక్కడ ఆఫీస్ లేదు. దీంతో వారు బాబాకు ఫోన్ చేయగా స్వీచ్ఛాప్ వచ్చింది. ఆందోళన చెందిన దంపతులు మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాబాజాఫర్ఖాన్పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటరత్నం తెలిపారు. అపరిచిత ఫోన్‌కాల్స్, మెసేజ్‌లను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.