వరంగల్, ఆగస్టు 19 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలు, అభివృద్ధి పనులు, హరితహారం లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, బల్దియా అధికారులతో నిర్వహించిన సమావేశంలో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.179.34కోట్లతో చేపట్టిన 419 అభివృద్ధి పనుల్లో రూ.106.44కోట్లతో 259 పనులను పూర్తి చేశామని, 31 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన 119 పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని ఆదేశించారు. హరితహారం లో భాగంగా ఇప్పటి వరకు కార్పొరేషన్ పరిధిలో పది లక్షల మొక్కలు మాత్రమే నాటారని, మిగిలిన మూడు లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పారిశుధ్య నిర్వహణపై చర్చించారు. శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు పని తీరును మార్చుకోవాలని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అంబేద్కర్ భవన్ వద్ద కొత్త డ్రెయిన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, హోటళ్లలో చెత్త నిర్వహణ సరిగా నిర్వహించేలా చూడాలని, అవసరమైతే జరిమానాలు సైతం విధించాలన్నారు. స మావేశంలో అదనపు కమిషనర్ నాగేశ్వ ర్, బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, సీ పీ వెంకన్న, సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఈఈలు శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, శ్రీనివాసరావు, రాజ య్య, డీఈలు, ఏఈలు, ఏసీపీ, టీపీఎస్, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.