చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
వరంగల్ చౌరస్తా, ఆగస్టు 13 : అవయవదానం గొప్పదని, మరణానంతరం కూడా చిరంజీవులుగా జీవించొచ్చని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం ములుగురోడ్ జంక్షన్‌లోని ఒమేగా బన్ను హాస్పిటల్లో జీవన్‌ధార్ సంస్థ ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. ఒక వ్యక్తి మరణానంతరం అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేయడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ముందుకు రావాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి ముందుకొచ్చిన ఒమేగా బన్ను హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చరణ్జీత్రెడ్డి, జీవన్‌ధార సంస్థ సీనియర్ కో ఆర్డినేటర్ భానుచంద్రను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బందితో కలిపి సుమారు 150 మంది తమ అవయవాలను దానం చేయడానికి అనుమతిపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా జీవన్‌ధార్ సంస్థకు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రవీందర్‌రెడ్డి, వెంకటసింహ, నిఖిల్, దిలీప్ నాగరాజు, బన్ను ఆరోగ్య సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు, జీవన్‌ధార్ కో ఆర్డినేటర్ పవన్‌రెడ్డి పాల్గొన్నారు.