ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. పులికి హాని తలపెడితే చర్యలు తప్పవని హెచ్చరిక
కదలికల పరిశీలనకు ప్రత్యేక బృందాలు.. సమాచారమిస్తే పారితోషికం
డీఎఫ్వో ప్రదీప్కుమార్శెట్టి, ఏఎస్పీ సాయిచైతన్య సూచన
మంగపేట మండలంలో పాదముద్రల గుర్తింపు.. మగ పులిగా నిర్ధారణ
ములుగు, నవంబర్10 (నమస్తే తెలంగాణ) / ములుగు రూరల్ : ములుగు జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అడవుల్లోకి పశువుల, కాపర్లు, పోడుదారులు, ప్రజలు వెళ్లొద్దని డీఎఫ్వో ప్రదీప్కుమార్శెట్టి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పులికి ఎలాంటి హాని తలపెట్టినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో కెమెరా ట్రాప్స్ నిఘా పటిష్టం చేశామని అన్నారు. పులి కదలికలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అటవీ శాఖ అధికారులు వివిధ గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి వేటాకు సంబంధించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పులి కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారికి పారితోషికం అందజేస్తామని చెప్పారు. పులి పశువులను వేటాడితే తమకు సమాచారం ఇస్తే నష్టపరిహారం అందిస్తామని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ములుగు ఏజెన్సీ ప్రాంతంలో పులి అనవాళ్లు కనిపిస్తున్నాయని, సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పులి సాచారంపై పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ములుగు అటవీ ప్రాంతంలోకి పులి వచ్చినట్లు జిల్లా అటవీ శాఖ ధ్రువీకరించిందన్నారు. పులికి ఎలాంటి హాని తలపెట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. వేటాడే ప్రయత్నం చేసే వారికి, సహకరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ జంతువులకు హాని తలపెడితే నాన్ బెయిలబుల్ కేసు నమోదవుతుందన్నారు.
పులి పాదముద్రల గుర్తింపు
మంగపేట, నవంబర్ 10 : మండలంలోని కొత్తూరు మొట్లగూడెం అటవీ ప్రాంతంలో బుధవారం అటవీ శాఖ రేంజ్ అధికారి షకీల్పాషా ఆధ్వర్యంలో సిబ్బంది పులి పాదముద్రలను గుర్తించారు. ఈ ప్రాంతంలో పులి దాడిలో ఆవు మృతి చెందిన నేపథ్యంలో పరిసర గూడేలకు చెందిన వారిని అప్రమత్తం చేసినట్లు రేంజ్ అధికారి షకీల్పాషా, పంచాయతీ కార్యదర్శి గుగులోతు చందూలాల్ తెలిపారు. కొత్తూరు మొట్లగూడెం అటవీ ప్రాంతం నుంచి బొమ్మాయిగూడెం అడవి మీదుగా నర్సాయిగూడెం, నర్సింహసాగర్, లేదా తాడ్వాయి మండలం దామెరవాయి అడవుల్లోకి పులి వెళ్లి ఉంటుందని పాదముద్రల ఆధారంగా గుర్తించినట్లు రేంజ్ అధికారి తెలిపారు. పాదముద్రల పరిశీలనలో మగపులిగా నిర్ధారణ అయినట్లు ఆయన పేర్కొన్నారు.