మహబూబాబాద్, అక్టోబర్ 4 : తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను గౌరవించి ఏవిధంగా చీరలు పంపిణీ చేస్తోందో, అదే విధంగా ఆడపిల్లలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ కే.శశాంక అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ సుంకరనేని నాగవాణి ఆధ్వర్యంలో ‘ఆడపిల్లలను గౌరవించాలి’ అనే వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కొంతకాలంగా ఆడపిల్లలు ఎన్నో అవమానాలు, సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగను ఎలా ఆదరిస్తున్నామో.. ఆడపిల్లలనూ అదేవిధంగా ఆదరించాలని సూచించారు. ఆడపిల్లలను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం, మంచి భవిష్యత్తునిద్దాం, రేపటి సమాజానికి ఓ తల్లిలా, చెల్లిలా, స్నేహితురాలిగా ఆదరిద్దామని పిలుపునిచ్చారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగకుండా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిలాషా అభినవ్, అదనపు కలెక్టర్ కొమురయ్య, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలతాలెనినా, సీడబ్ల్యూసీ మెంబర్ డేవిడ్, బీఆర్బీ కో ఆర్డినేటర్ జ్యోతి, డీసీపీవో కమలాకర్, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ వెంకటేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయాలి
వైద్యకళాశాల విద్యార్థుల తరగతుల కోసం నిర్మిస్తున్న అదనపు గదుల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కే.శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా దవాఖానలో నిర్మిస్తున్న అదనపు గదుల పనులను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… వైద్య విద్యార్థుల బోధన కోసం తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని మెప్మా అధికారులకు సూచించారు. మ్యాప్‌ను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. విధుల్లో సమయపాలన పాటించాలన్నారు. చికిత్స పొందుతున్న రోగుల పట్ల ప్రేమ చూపాలని సూచించారు. టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, తాగునీరు వంటి సదుపాయాల్లో లోటు రాకుండా చూసుకోవాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఉన్న మార్చురీని నూతనంగా నిర్మించాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకట్రాములు, ఆర్ఎంవో వైదేహి, వివిధ విభాగాల వైద్య నిపుణులు, ఇంజినీరింగ్ శాఖ టీఎస్ ఎంఐడీసీ ఈఈ మహేశ్, డీఈ శ్రీనివాస్, మెప్మా అధికారులు పాల్గొన్నారు.
వినతుల వెల్లువ
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కలెక్టర్‌కు వినతులు అందజేశారు. పంచాయతీ ట్రాక్టర్లను సర్పంచ్‌లు వ్యక్తిగత పనులకు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ అధికారులు చొరవ చూపాలన్నారు. డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన బానోత్ బోజ్య మనువడు శంకర్‌కు 78 సర్వే నంబర్లో 9. 33 ఎకరాల భూమికి హద్దులు చూపించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.