పేదల కోసం తపించడంలో ఎన్టీఆర్, కేసీఆర్‌ది ఒకటే పంథా
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
కమ్మ సంఘం ఆధ్వర్యంలోఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ
బయ్యారం, అక్టోబర్3: తెలుగు ప్రజల ఆరాధ్యుడు, నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఆదివారం మండలంలోని గంధంపల్లి బస్టాండ్ సెంటర్లో కొత్తపేట, గంధంపల్లి కమ్మ సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే హరిప్రియానాయక్తో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ, మాజీ మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. దేశ రాజకీయాలను ఎంతో ప్రభావితం చేసి తెలుగు వారి గౌరవాన్ని దేశానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. నటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అదే పంథాను కొనసాగిస్తూ పేదల సంక్షేమం కోసం అహర్నిశలు పాటు పడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టమని తెలిపారు. కేసీఆర్ తనకు అవకాశం వల్లే ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో ముందు వరుసలో నిలబెట్టగలుగుతున్నామని తెలిపారు. బయ్యారం రైతులకు జీవనాధారమైన పెద్ద చెరువు అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని, ఇక్కడి రైతుల ఆశలు కూడా త్వరలోనే నెరవేరుతాయన్నారు. వృథాగా పోతున్న గోదావరి జలాలను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ రైతాంగానికి ఉపయోగపడేలా సీతారామ ప్రాజెక్ట్ రూపకల్పన చేశారని తెలిపారు. అనంతరం గంధంపల్లి పంచాయతీ కార్యాలయం ఆవరణలో చేతన ఫౌండేషన్ సహకారంతో వెనిగళ్ల వెంకట్రామయ్య, సుబ్బమ్మ మోమెరియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను వారు ప్రారంభించారు. అనంతరం గంధంపల్లి జిల్లాపరిషత్ పాఠశాలకు 58 బల్లలు, వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు, ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లను చేతన ఫౌండేషషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, భద్రాద్రి కొత్తగూడెం చైర్మన్ కోరం కనకయ్య, ప్రభుత్వ విప్, కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరికెపుడి గాంధీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తాత మధు, కమ్మ సంఘం నాయకులు సురేశ్, చావ నారాయణ, రత్నాకర్, విగ్రహదాత బొడ్డు రవి శంకర్, ఇల్లందు నాయకులు బీ వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ తాత గణేశ్, సర్పంచ్ మమత, వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
7 నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 3 : చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 7 నుంచి 15వ వరకు రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కేయూ వీసీ రమేశ్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈవో వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ, 7 నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున యం త్రాంగానికి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. బతుకమ్మకు వచ్చే మహిళలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. వేయిస్తంభాల దేవాలయంలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు తనవంతు చందాగా రూ.50 వేలు ఆలయ ఈవోకు అందజేశారు.