తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నవా? అది తీరని కోరిక’ అంటూ ఎదురైన అవమానాన్ని భరించలేక హలావత్ చిన్న రాజేందర్ మనస్తాపంతో బలిదానం చేసుకున్నాడు. అమరుల త్యాగఫలితంగా అవతరించిన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వారి ఆకాంక్షల మేరకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపింది. గీసుగొండ మండలం దస్రుతండాకు చెందిన చిన్నరాజేందర్ కుటుంబసభ్యులు ‘నమస్తే’తో మాట్లాడుతూ స్వరాష్ట్రంలోనే అమరుల కలలు సాకారమవుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లలోనే తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని, తమ కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వమే ఆదుకున్నదని స్పష్టం చేశారు.
– వరంగల్, జూన్ 23 (నమస్తేతెలంగాణ)
వరంగల్, జూన్ 23 (నమస్తేతెలంగాణ) : హలావత్ చిన్న రాజేందర్. స్వగ్రామం గీసుగొండ మండలంలోని దస్రుతండా (కొమ్మాల). విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నపుపడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ కోసం జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షల్లో పాల్గొన్నాడు. సెలవులకు వచ్చి తిరిగి విజయవాడకు వెళ్లిన సందర్భాల్లో చిన్న రాజేందర్‌ను కళాశాలలో సీమాంధ్రులు హేళన చేశారు. తెలంగాణ ఉద్యమం పట్ల చులకనగా మాట్లాడారు. ‘ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నవా? అది తీరని కోరిక’ అంటూ అవమాన పరిచారు. దీంతో చిన్న రాజేందర్ మనస్తాపం చెందా డు. జరిగిన సంఘటనను ఫోన్ ద్వారా దస్రుతండాలోని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. పట్టించుకోవద్దని కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా మనస్తాపంతో కళాశాల ప్రహరీ దూకి వరంగల్ బయల్దేరాడు. నేరుగా ఇంటికొచ్చి తన తల్లితో చెబుతూ కంట తడి పెట్టాడు. అనంతరం తండా శివారులోని తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి కూల్ డ్రింక్‌లో విష గుళికలను కలిపి తాగాడు. అప్పటికే అతడి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు, వ్యవసాయ బావి వద్ద పడి ఉన్న రాజేందర్‌ను చికిత్స కోసం ఎంజీఎంహెచ్కు తరలించారు.
పరిస్థితి విషమించి అదేరోజు చనిపోయాడు. అతడి ప్యాంటు జేబులో చీటీ లభించింది. అందులో ‘తెలంగాణ లేని జీవితం వ్యర్థ్యం.. తెలంగాణ కోసం నేను చనిపోతున్నా’ అని రాసి ఉంది. 2010 ఫిబ్రవరి 2న ఈ ఘటన జరిగింది. చిన్న రాజేందర్‌కు తల్లి బొందమ్మ, సోదరి వినోద, సోదరులు వీరన్న, రాజేందర్ ఉన్నారు. 2014లో చిన్న రాజేందర్ ఆకాంక్ష నెరవేరి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు దీరింది. తెలంగాణ కోసం బలిదానం చేసిన అమరుడు చిన్న రాజేందర్ కుటుంబాన్ని గుర్తించి ఆదుకుంది. ఆయన కుటుంబానికి రూ.10 లక్షలు అందజేసింది. అతడి సోదరుడు రాజేందర్‌కు ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం రాజేందర్ వరంగల్ జిల్లా మామునూరు టీఎస్పీ 4వ బెటాలియన్‌లో జూనియర్ అసిస్టెంటుగా చేస్తున్నాడు. తల్లి బొందమ్మ ఇతడి వద్దే ఉంటున్న ది. ప్రభుత్వం ఇచ్చిన 10లక్షలతో మృతుడి అన్న వీరన్న దస్రుతండాలో భూమి, బర్రెలు కొనుగోలు చేశాడు. వ్యవసాయం చేస్తూనే మినీ డెయిరీని నడుపుతున్నాడు. చిన్న రాజేందర్ చనిపోకముందే అతడి సోదరి వినోదకు వివాహమైంది. ప్రస్తుతం అతడి కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది.
కేసీఆర్ సర్కారే మా కుటుంబాన్ని నిలబెట్టింది
నాకు మొత్తం నలుగురు సంతానం. బిడ్డ వినోద అందరికంటే పెద్దది. పెద్ద కొడుకు వీరన్న. రెండోవాడు చిన్న రాజేందర్. చిన్నోడు రాజేందర్. చిన్న రాజేందర్ ఎప్పుడూ తెలంగాణ ధ్యాసలనే ఉండేటోడు. ఉద్యమంలో పాల్గొన్నడు. తెలంగాణ వస్తేనే మన బతుకులు బాగుపడుతయనేటోడు. చదువు కోసం విజయవాడకు పోయి సెలవు వచ్చిందంటే ఇక్కడికొచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటోడు. ఆంధ్రోళ్లు హేళన చేసిండ్రని విజయవాడ నుంచి ఇంటికొచ్చి ఏడ్చిండు. తెలంగాణ కోసం చనిపోతున్నానని చీటీ రాసి జేబుల పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నడు. ఎంతో దుఃఖంలో ఉన్న మా కుటుంబానికి సీఎం కేసీఆర్ ఆసరా అయిండు. రూ.10 లక్షలు అందించి ఆదుకున్నడు. నా చిన్న కొడుకు రాజేందర్‌కు సర్కారు కొలువు ఇచ్చిండు.
– హలావత్ బొందమ్మ,
అమరుడి తల్లి, దస్రుతండా తెలంగాణ దేశానికే ఆదర్శమైంది
మా తమ్ముడు చిన్న రాజేందర్‌కు ఎప్పు డూ తెలంగాణ రాకపోతే మన బతుకులు వేస్ట్ అనేటోడు. ఇప్పు డు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం, ఉద్యమ నేత కేసీఆరే సీఎం కావడంతో అమరుల ఆశయాలు నెరవేరుతున్నా యి. త్యాగాలకు ఫలితం కనిపిస్తున్నది. అనేక సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధితో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ ప్రభుత్వం మా కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చింది. మా చిన్న తమ్ముడు రాజేందర్‌కు ఉద్యోగం ఇచ్చింది. నేను మా ఊళ్లో ఇంత వ్యవసాయ భూమి కొన్న. కొన్ని బర్లు కూడా కొని పాడి పరిశ్రమ నడుపుకుంటున్న. ఇటు వ్యవసా యం, అటు పాడి పరిశ్రమతో మా కుటుం బం హ్యాపీగా ఉంది. మా చిన్న తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నడు.
– హలావత్ వీరన్న, అమరుడి అన్న
అమరుల ఆకాంక్షలు నెరవేరుతున్నయ్
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో అమరుల ఆకాంక్షలు నెరవేరుతున్నయ్. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పుడది తీరుతోంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ముందుకు పోతున్నరు. సకల జనులకు మేలు జరిగేలా పాలన సాగిస్తున్నరు. ఉద్యమ సమయంలో మీకు పాలించుకునే తెలివి లేదన్న సీమాంధ్రులకు బుద్ధి చెప్పే రీతిలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. మరే రాష్ట్రంలో లేని పథకాల అమలుతో తెలంగాణ దేశానికే మోడల్‌గా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర నడిబొడ్డున తెలంగాణ అమరవీరుల స్మారకం నిర్మించడం గర్వించదగిన విషయం.
– హలావత్ రాజేందర్, అమరుడి తమ్ముడు