నర్సింహులపేట, జూలై 16 : వేసవి కాలం ముగిసి వానకాలం సగం దాటినా నేటి వరకు వర్షం కురవలేదు. కరువు ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అడపాదడపా కురిసిన చిరుజల్లులకు పత్తి, మక్కజొన్న వంటి పంటలు వేసినా వరిసాగు మాత్రం ఎక్కడా ఇంకా ప్రారంభం కాలేదు. నర్సింహులపేట మండలంలోని 22 గ్రామాల్లో ఎక్కడ చూసినా చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేని పరిస్థితి. గతేడాది జూలై నెలలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు మత్తడిపోయగా, ఈ ఏడాది ఇప్పటి వరకు భారీ వర్షం కురవలేదు. మండలంలో 8 చెరువులు, 38 కుంటల్లో చుక్కనీరు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్, జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
గతేడాది జూలైలో కురిసిన వర్షాలకు నర్సింహులపేట మండలం జయపురం వద్ద ఉన్న ఆకేరు వాగు చెక్ డ్యాం జోరుగా మత్తడి పోసింది. ప్రస్తుతం జూలై నెలలో చుక్క నీరులేక వెలవెలబోతున్నది. ఆకేరువాగును నమ్ముకొన్న రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు.