ఖిలావరంగల్: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపల్లి బాబు అన్నారు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్లో పండిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోవడం లో జాప్యం చేస్తుందన్నారు. జిల్లాలో లక్షా పదివేల ఎకరాల వరి పంటను రైతులు పండించారని, కాని ఇప్పటి వరకు లక్షా 15 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారన్నారు.
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సరైన మౌలిక వసతులు లేవని, అలాగే సరియైన సమయంలో ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ట్రాన్స్పోర్టు వ్యవస్థ సరిగా లేదని విమర్శించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయిందని, కొంతమంది రైతుల ధాన్యం కుప్పలు వరద నీటిలో కొట్టుకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రులు తడిసిన ధాన్యాన్ని ఖరీద్ చేస్తామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు రైతాంగానికి భరోసా కల్పించుటలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని తెలిపారు. రైతాంగానికి భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి, జిల్లా నాయకులు ముంజల సాయిలు, కోడెం రమేష్, పాత్కాల సుధాకర్, పొన్నం రాజు తదితరులు పాల్గొన్నారు.