వరంగల్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ సర్కార్ కాళ్లకింద నేల కదులుతున్నదా? క్రితం ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ పుంజుకుంటున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అందుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే తాజా ఉదాహరణ. అధికారం తమ చేతుల్లో ఉందని విర్రవీగుతూ కన్నుమిన్నూకానకుండా వ్యవహరిస్తే ప్రజలు క్షమించరని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాయి. అలాగే, ప్రజలకు మరింత చేరువయ్యే మార్గాలకు ఇంకాస్త పదునుపెట్టండీ అంటూ బీఆర్ఎస్కూ ప్రజలు సూచించారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకొని అందుబాటులో ఉన్న అన్ని వ్యవస్థలను యథేచ్ఛగా వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఐదేండ్లు ఈ పీఠానికి ఏ ఇబ్బందీ ఉండదనే భరోసాను ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టలేదు. నిజానికి, నాలుగేండ్ల పరిమితి ఉన్నా ‘దినదిన గండం-నూరేళ్ల ఆయుష్షు’ అన్నట్లే ఉంటుందని ఆయా మున్సిపాలిటీల్లో నెలకొన్న రాజకీయ బలాబలాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ భౌతిక విజయం సాధించినా.. నైతిక విజయాన్ని బీఆర్ఎస్ సొంతం చేసుకున్నదని వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల ఎన్నికల్లో ఓటింగ్ సరళి స్పష్టం చేస్తున్నది. ఒకటి రెండు మున్సిపాలిటీలు మినహా మిగతా అన్నింటిలో కాంగ్రెస్‌కు తానేమి చేసినా చెల్లుబాటు అవుతుందన్నంత సులువుగా లేదని ప్రజాతీర్పు తేల్చిచెప్తున్నది.
సర్కారుపై విస్తరిస్తున్న వ్యతిరేకత
కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్నదని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. ఇట్లానే కొనసాగితే రానున్న రోజుల్లో అది మరింత చేజారిపోయే ప్రమాదం పొంచి ఉన్నదనే స్పష్టమైన సంకేతాన్ని మున్సిపల్ ఎన్నికలతో తేలిపోతున్నది. ఇటీవల జరిగిన పంచాయతీ, ఇప్పటి మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఒకటి రెండు మినహా మిగిలిన వాటి ఓటింగ్ సరళిని నిశితంగా గమనిస్తే కానీ కాంగ్రెస్‌కు కాళ్లకింద నేల కదులుతున్నదనే విషయం అర్ధం కాదు. దాదాపు ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్కు మధ్య ఓటు బదిలీ మధ్య వ్యత్యాసం అతి స్వల్పంగానే ఉన్నది. ‘బీఆర్ఎస్ ఇంకా పూర్తిగా ఎలక్షనీరింగ్‌లో ఇన్వాల్వ్ కాలేదు. అయితే ఫలితాలు వేరేలా ఉండేవి’ అని వరంగల్ ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. సర్దుబాటు చేసుకోకపోతే సమరాన్ని ఫేజ్ చేయాల్సిందేనని ఆ నేత అభిప్రాయం.
జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, పరకాల, భూపాలపల్లి, కేసముద్రం, వర్దన్నపేట వంటి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లను చూస్తే తెలిసిపోతుందని సదరునేత విశ్లేషణ. ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టు అధికారం తోడైనందు వల్ల కొన్ని మున్సిపాలిటీల్లో విజయం సాధించాం కా నీ, ప్రభుత్వంపై ప్రజలు అంత సంతృప్తిగా ఉన్నారని ధైర్యంగా చెప్పేందుకు ఏమీలేదని మరో కాం గ్రెస్ నేత అభిప్రాయపడుతున్నారు. 2020లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 మున్సిపాలిటీలను నాటి బీఆర్ఎస్ పార్టీ సాలిడ్‌గా సొంతం చేసుకున్నట్టే ఇప్పుడు తమకూ వస్తాయని ఊహిస్తే ఆ పార్టీది అత్యాశే అని ప్రజలు తీర్పు ఇచ్చారు. కొత్త మున్సిపాలిటీల్లో రెండుచోట్ల, పాత మున్సిపాలిటీల్లో రెండు చోట్ల మినహా అన్నింటిలో ఫలితాలు కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పెట్టించాయి.

ఏడు చోట్ల బీజేపీ.. ఎనిమిదింటిలో కమ్యూనిస్టులు జీరో
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో బీజేపీ, ఎనిమిదింటిలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, తొర్రూరు, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో బీజేపీ ఒక్కచోట కూడా ఖాతా తెరవలేదు. గతంలో 9 మున్సిపాలిటీలున్నప్పుడు బీజేపీ నుంచి 10 మంది కౌన్సిలర్లుంటే, ఇప్పుడు 12కు పెరిగినా ఆ పార్టీ కేవలం 8 మంది కౌన్సిలర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక కమ్యూనిస్టుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. వర్ధన్నపేట, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, తొర్రూరు, స్టేషన్‌ఘన్‌పూర్, ములుగు, పరకాల మున్సిపాలిటీల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యమే కరువైంది.
