యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. మానేరు, చలివాగు, చెరువులు, బోర్లు ఎండిపోయాయి. కాల్వల ద్వారా నీరు రాక చాలా చోట్ల సాగునీటి కొరత ఏర్పడింది. దీంతో ముఖ్యంగా వరి, ఇతర పంటలు దెబ్బతినే పరిస్థితి దాపురించింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. గత పదేళ్లలో కనిపించని క్రేన్లను మళ్లీ తెస్తున్నారు. బావుల్లో పూడిక తీయడం, కొత్త బావులు తవ్వడం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని రైతులు కాళేశ్వరం ప్రాజెక్టును గుర్తు చేసుకుంటున్నారు. ప్రాజెక్టును ఎండబెట్టడం వల్లే ఈ పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి. ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండడం, చెరువుల్లో నీటి మట్టం తగ్గడం.. బోర్లపై ఆశలు సన్నగిల్లడం.. మానేరు, చలివాగు ఎండిపోవడం తదితర కారణాలతో అన్నదాతల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా ఉపయోగించుకోలేని పాలకుల తీరుపై మండిపడుతున్నారు. ఫలితంగా జిల్లాలో మళ్లీ క్రేన్లు దర్శనమిస్తున్నాయి.
చిట్యాల మండలం కైలాపూర్, టేకుమట్ల మండలం ఆరెపల్లిలోని వ్యవసాయ బావు ల్లో రైతులు పూడికతీత పనులు ప్రారంభించారు. ఎండలు తీవ్రతరమైతే ఏప్రిల్, మే వరకు బోరు, బావుల్లో చుక్క నీరు ఉండే పరిస్థితి లేదు. దీంతో రైతులు కొత్త బావులు తవ్వేందుకు సిద్ధమవుతున్నారు. నిరుడు ఇదే సమయంలో ఇంతగా సాగునీటి సమస్య తలెత్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టడంతో ఈ పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు మూలంగా భూగర్భ జలాలు పెరిగాయని, బావులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉండేవని గుర్తు చేసుకుంటున్నారు.
జిల్లాలో చాలా వరకు వరి నాట్లు పూర్తయ్యాయి. చెరువులు, బావులు, బోర్లతో పాటు డీబీఎం-38, చలివాగు, మానేరు వాగుపై ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఈ యాసంగిలో 92,500 ఎకరాల్లో వరి, 19,500 ఎకరాల్లో మక్కజొన్న సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే ఈ రెండు పంటలకు నీటి అవసరం ఎక్కువే. ప్రస్తుతం వరి, మక్కజొన్న సాగు ప్రారంభ దశలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో నీటి ఎద్దడి ప్రారంభమైంది. భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందించలేకపోతున్నారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో 45 వేల ఎకరాలకు సాగునీరు అందించే డీబీఎం-38 కాలువలో చుక్క నీరు లేదు. కాల్వలు పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోడంతో మొగుళ్లపల్లి మండలంలో రైతులు సొంత డబ్బులతో పిచ్చి మొక్కలు తొలగించుకుంటున్నారు. చలివాగు, మానేరులో సైతం బోర్లు వేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. చిట్యాల, టేకుమట్ల మండలాల్లో రైతులు క్రేన్లు, జేసీబీల ద్వారా బావుల పూడికతీత పనులు ప్రారంభించారు. టేకుమట్ల మండలంలో రైతులు కొత్తగా బావులు తవ్వించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఎన్నడూ లేని విధంగా కరువు వచ్చింది. ఎప్పుడూ మానేరులో నీళ్లు నిండుకుండలా ఉండేవి. ఈ సారి చుక్క నీరు లేదు. వరి పంట వేస్తే ఎండి పోతాంది. బావులు, బోర్లలో నీళ్లు మొత్తమే పడిపోయినయ్. ఏం చేయాలో తోచక పాత బావిని నేను, నా పక్క పొలం యజమాని భూమయ్య కలిసి పొత్తుల పూడిక తీపించుకుంటున్నం. ఖర్చు ఎక్కువ అవుతున్నా తప్పుతలేదు. లేకపోతే పంట ఎండుద్ది. ఇప్పుడు గిట్లుంటే వరి పంట ఈనే వరకు నీళ్లు అందకపోతే మా పరిస్థితి ఏంటి. తలుచుకుంటేనే భయమేస్తున్నది.
– కొండ వంశీ, రైతు, వెంకట్రావ్పల్లి, టేకుమట్ల మండలం
నాకున్న ఐదు ఎకరాల్లో మిర్చి పంట వేసిన. మొన్నటి దాక నీళ్లకు ఇబ్బంది కాలే. ఇప్పుడు నీళ్లు అందుతలేవు. రెండు ఎకరాలకు కూడా నీళ్లు ఎల్తలేవు. మిర్చి చేతికి వచ్చే టైంల నీళ్లు లేక పోవడంతో ఏం తోత్తలేదు. పూడిక తీస్తే బావిల నీళ్లు పడుతయని తీపిస్తున్న. అయినా నీళ్లు రాకపోతే పంట పోయినట్లే. గతంలో ఎప్పుడూ ఇంత గోస రాలే. బోర్లు కూడా ఎండిపోతున్నయ్. వాగులల్ల నీళ్లుంటే బావులు, బోర్లలో నీళ్లుండేటియి.
– వేముల ఓదెలు. కైలాపూర్, చిట్యాల మండలం
కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే సాగునీటి కష్టాల నుంచి కాపాడుతుందని రైతులు గుర్తించారు. కేసీఆర్ పాలనలో ఏనాడూ సాగునీటి కష్టాలు రాలేదని, ప్రాజెక్టును పక్కన పెట్టిన నాటి నుంచే నీటి ఎద్దడి తీవ్రమైందని వాపోతున్నారు. అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేయడంతో మానేరు, చలివాగులు ఎప్పుడూ నిండుకుండ ల్లా ఉండేవని, బోర్లు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండేవని గుర్తు చేసుకుంటున్నారు. నాటు దశలోనే ఈ పరిస్థితి ఉంటే పంట చేతికొచ్చేదాక పంటలను బతికించుకునేదెలా అని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలో ఉన్న చెరువులు సైతం నీరు లేక నెర్రలు బారడం గమనార్హం.