అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతను అరిగోసపెడుతున్నది. వేసవి ప్రారంభంలోనే వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోగా, ప్రభుత్వం కాల్వల ద్వారా నీరు విడుదల చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుండడంతో భూగర్భ నీటిమట్టం వేగంగా పడిపోతున్నది.
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని ప్రధాన జలాశయాలన్నీ అడుగంటుతున్నాయి. దీనికి తోడు విద్యుత్ సమస్య మరింత కష్టాల పాలు చేస్తున్నది. ఫలితంగా యాసంగి పంటలు రైతుల కళ్లముందే ఎండిపోతున్నాయి. తడారిన నేలకు నీరు పెట్టేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. అయినప్పటికీ సమృద్ధిగా నీరందక ఇప్పటి కే సగం మేర పంటలు దెబ్బతిన్నాయి. మిగిలినదైనా చేతికొస్తుందా? పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందా? అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
– హనుమకొండ సబర్బన్, ఫిబ్రవరి 10
హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో సుమారు 3.50 లక్షల ఎకరాల్లో వరి, మరో లక్షన్నర ఎకరాల్లో మక్కజొన్న పంట ను రైతులు సాగు చేశారు. మరో లక్ష ఎకరాల్లో ఇతర పంటలతో పాటు ఉద్యాన పంటలు వేశారు. ఈ రెండు జిల్లాలకు ఎస్సారెస్పీతో పాటు దేవాదుల కాల్వలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఈ సారి వర్షాలు సమృద్ధిగానే కురిసినప్పటికీ ప్రభుత్వం ముందు చూపు లేని కారణంగా రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నది.
ప్రస్తుతం రెండు జిల్లాల్లో వరి పంట పొట్ట దశలో ఉండగా, మక్కజొన్న కంకి పెడుతున్న ఈ సమయంలో ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. అయితే నీటి లభ్యత లేక వరితో పాటు ఇతర పంటలు ఎండిపోతున్నాయి. అయితే ఎస్సారెస్పీ, దేవాదు ల ప్రధాన కాల్వల్లో నీరున్నప్పటికీ పొలాలకు వెళ్లే పిల్ల కా ల్వలు అధికారుల పర్యవేక్షణ లేక పిచ్చి మొక్కలు, పూడిక తో నిండిపోయాయి. దీనికి తోడు కాల్వలు ఆక్రమణలకు గురికావడంతో నీరు చివరి ఆయకట్టుకు వెళ్లడం లేదు. దేవాదుల ఉత్తర కాల్వకు కొన్ని రోజులుగా నీరు విడుదల చేస్తున్పటికీ ప్రధాన దక్షిణ కాల్వకు మాత్రం కేవలం నాలుగైదు కిలో మీటర్ల వరకు మాత్రమే జలాలు తరలుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఉత్తర కాల్వ ఆయకట్టు 15 వేల ఎకరాలుండగా, కేవలం 25 శాతం పొలాలకు కూడా నీరందడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇక ఎస్సారెస్పీ అనుబంధ కాకతీయ కాల్వ చివరి ఆయకట్టు రైతులకు నీరందక పోవడంతో పంటలు మొత్తం ఎండి పోయే పరిస్థితి నెలకొంది. కాగా, హనుమకొండ జిల్లాలో 876 చెరువులు ఉండగా, వరంగల్ జిల్లాలో 1063 ఉన్నట్లుగా నీటిపారుదల శాఖ లెక్కలు చెబుతున్నా యి. ఈ చెరువులు, కుంటలు ఇప్పటికే ఎండిపోగా, మధ్యస్థ చెరువుల్లో మాత్రం నీరు పూర్తిగా తగ్గిపోయింది.
ఈ ఏడాది క్రమం తప్పకుండా కురిసిన వర్షాలతో చెరువులన్నీ నిండాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నీటి నిల్వలు పెరిగినప్పటికీ వేసవి ప్రారంభంలోనే బావులు, బోర్లు వట్టిపోతున్నాయి. భూగర్భ జలాలు వేగంగా పాతాళానికి పడిపోతున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి గత ఏడాదితో పోలిస్తే ఈ సమయానికి రెండు మీటర్ల మేర నీటి మట్టం పడిపోయింది.
ఐనవోలు : నేను నాలుగు ఎకరాల్లో జొన్న, రెండెకరాల్లో వరి సాగు చేస్తున్న.. ఈ భూమికి ఒక బాయి, ఒక బోరు ఉన్నయి. వీటిలో నీళ్లు లేక ఆరెకరాల్లో వేసిన పంట ఎండిపోయింది. జొన్నకు ఇప్పటి వరకు ఎకరానికి రూ.20 వేలు, వరికి రూ.25 వేల చొప్పున పెట్టుబడి అయ్యింది. పది రోజుల కింద మరొక బోరు కూడా వేయించినా నీళ్లు పడలేదు. గతంలో డిసెంబర్ నుంచి మార్చి వరకు కాల్వల ద్వారా మస్తు నీళ్లు వచ్చేటియి. ఈ సారి మాత్రం ఒక్కసారే వచ్చినయ్. అప్పుడెప్పుడో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటలు ఎండినయ్. మళ్లీ ఇప్పుడు రేవంత్‌రెడ్డి సీఎం అయినంక ఎండుతున్న యి. ప్రభుత్వం ఇప్పటికైనా కాల్వలో నీళ్లు వదిలితే మిగిలిన రైతుల పంటలన్నా దక్కుతయి.
– కొట్టం రాజు, రైతు, ఒంటిమామిడిపల్లి (నాగపురం), ఐనవోలు మండలం
భీమదేవరపల్లి : అన్నదాతకు మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోగా, కాల్వల ద్వారా జలాలు రావడం లేదు. దీంతో వ్యవసాయ బావులు, బోర్లలో సైతం నీరు అడుగంటి పోతున్నది. దీంతో యాసంగి పంట వేసిన రైతులు బోర్లు, బావుల్లో ఉన్న కాస్త నీళ్లు పంటలకు అందించి వాటిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటే వస్తూ, పోతున్న కరెంట్‌తో మోటర్లు కాలిపోతుండడంతో వాటి మరమ్మతుకు అనేక కష్టాలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన కొదురుపాక వెంకటస్వామి అనే రైతుకు చెందిన మోటర్ కాలిపోయింది. అతడి వద్ద పనిచేస్తున్న మారుపాక గోపాల్ ఎడ్లబండిపై మోటర్‌ను రిపేర్ షాపుకు తీసుకెళ్లి మరమ్మతు చేయించిన అనంతరం బావిలో బిగించేందుకు వెళ్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయంటూ గ్రామస్తులు చర్చించుకోవడం కనిపించింది.
ఎల్కతుర్తి : మాకు 2 ఎకరాల పొలం ఉంది. వానకాలంలో పంట చేతికొచ్చింది. నీళ్లు పుష్కలంగా ఉంటయని యాసంగిలో సైతం 2 ఎకరాల్లో వరి నాట్లేసినం. గిప్పుడు నీళ్లు లేవు. పొలం మొత్తం ఎండిపోయింది. రోజుకు గుంట మడి కూడా తడుస్తలేదు. అప్పు తెచ్చి ఎకరాకు రూ. 35 వేల చొప్పున రూ. 70 వేల వరకు పెట్టబడి పెట్టినం. ఇన్ని పైసలు నీళ్లల్లో పోసినట్లయ్యింది. ఎండిపోయిన పంటలో ఎడ్లను మేపుతున్నం. సర్కారే మమ్మల్ని ఆదుకొని పరిహా రం చెల్లించాలి. లేకపోతే మా బతుకులు ఆగమవుతయ్.
– అల్లి ప్రమీల, మహిళా రైతు, ఎల్కతుర్తి
పరకాల : నాది పరకాల మండలం వెల్లంపల్లి. నాకు గ్రా మ శివారులో మూడు వ్యవసా య బావుల కింద 12 ఎకరాల్లో యాసంగి వరి పంట సాగు చేస్తు న్న. గత పదేండ్లలో ఎస్సారెస్పీ కాల్వ ద్వారా సాగు నీరు రావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట పండేది. ఈ సారి ఇప్పటికే వ్యవసాయ బావులు అడుగంటడంతో నాలుగు ఎకరాల పొలాన్ని వదిలిపెట్టి ఎనిమిది ఎకరాలకే నీరు పెడుతున్న. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వ్యవసాయ బావుల్లో సరిపడా నీరుండడం లేదు. మరోపక్క కాల్వల ద్వారా నీరు రావడం లేదు. రానున్న రోజుల్లో నీరు లేక మొత్తం పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. కేసీఆర్ పాలనలో ఎన్నడూ సాగు నీటికి ఇబ్బంది రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. మళ్లా ఎనకటి రోజులు ముందుకు వస్తున్నయి.
– గంట సమ్మిరెడ్డి, రైతు, వెల్లంపల్లి, పరకాల
కమలాపూర్ : నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. 1.20 ఎకరాల్లో మక్కజొన్న, 30 గుంటలు వరి పంట వేసిన. వ్యవసాయ బావిలో నీళ్లు అడుగంటి రోజుకు పదిగుంటలు మాత్రమే పారుతాంది. మక్కజొన్నకే వరుస తడులు తిరుగుతుంది. పొలానికి నీళ్లు అందకపోవడంతో పక్కనున్న వ్యవసాయ బావిని లీజుకు అడిగితే ఇవ్వలేదు. దీంతో పొలం ఎండుతాంది. పదేళ్లలో ఏనాడూ పొలం ఎండుడు చూడలేదు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదికే కరువు మొదలైంది. కుంటలో కాల్వ నీళ్లు నిండి పంటలు పండేది. అసొంటిది చూద్దామన్నా కాల్వ నీళ్లు రావడంలేదు. పొలం వదిలేసి మక్కజొన్నకు నీళ్లు కడుతున్న. పొలంకు పెట్టిన పెట్టుబడి డబ్బులు మీదపడ్డయి.
– చెరిపెల్లి జీవానందం, రైతు, శనిగరం, కమలాపూర్ మండలం