ములుగు, జూలై16(నమస్తేతెలంగాణ) : గోదావరి జలాలను పంపింగ్ చేసి రిజర్వాయర్‌లోకి తరలించాలని బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితంతో రామప్పకు జలకళ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముందు చూపుతో గోదావరి నదిపై ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో దేవాదుల పంపు హౌస్‌లోని ఏడు మోటర్ల ద్వారా భీమ్ఘనపురం రిజర్వాయర్‌లోకి, అక్కడి నుంచి రామప్ప సరస్సుకు జలాలు తరలుతున్నాయి.
గత రెండు రోజుల నుంచి రెండు మోటర్ల ద్వారా రోజుకు 100 ఎంసీఎఫ్‌టీల నీరు పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు గోదావరి జలాల వినియోగంపై జరుగుతున్న అన్యా యంపై పోరాటం చేయడంతో ఈ నెల 13వ తేదీన దేవాదుల పంప్‌హౌస్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించి పంపుహౌస్‌లోని 10 మోటర్లను నడిపి ఆయకట్టులోని రిజర్వాయర్లన్నింటిలోకి గోదావరి నీటిని పంపింగ్ చేస్తామని అన్నారు. రామప్ప సరస్సు పూర్త స్థాయి నీటి మట్టం 36అడుగులు కాగా ప్రస్తుతం 26ఫీట్లకు చేరుకుంది. గోదావరిలో నీటి లభ్యతను భట్టి దేవాదుల పంపుహౌస్ ద్వారా నీటిని పంపింగ్ చేయనున్నారు.
ప్రస్తుత కరువులో సమ్మక్క సాగర్ స్టోరేజ్ వాటర్ కల్పతరువుగా మారింది. గోదావరి జలాలను రామప్పలోకి తరలిస్తుండడంతో 365 రోజులు సరస్సు జలకళతో కనువిందు చేస్తున్నది. తాగు, సా గుకు సరస్సు నీటిని వినియోగిస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం ఫిల్టర్ బెడ్‌ను ఏర్పాటు చేయగా మిషన్ భగీరథ కింద 239 ఎంసీఎఫ్‌టీలు వినియోగించనున్నారు. రామప్ప పరిధిలో వెంకటాపూర్, ము లుగు, గణపురం మండలాల్లోని పలు గ్రామాల్లో అధికారికంగా 5,150 ఎకరాల ఆయక ట్టుకు నీరందుతుండగా, అనధికారంగా మరో 5 వేల ఎకరాలు సాగవుతున్నది. నర్సంపేట నియోజకవర్గంలోని రంగాయ చెరువును నింపి అకడి నుంచి ఖానాపురం మండలం పాకాల సరస్సుకు 1,050 ఎంసీఎఫ్‌టీల జలాలను వేసవిలో తరలించేందుకు నిర్ణయించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం చెరువును నింపనున్నారు.
అలాగే ఇకడ ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పంప్ హౌస్ నుంచి ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, మల్లంపల్లితో పాటు గణపురం మండలంలోని పలు గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరందించనున్నారు. కాగా, గత జనవరిలో మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ములుగు మండలం లోని 14 గ్రామాలకు సాగు నీరందించేందుకు రూ.200 కోట్లు సీఎం మంజూరు చేయగా సంబంధిత పనులు కొనసాగుతున్నాయి. రామప్ప నుంచి లక్నవరం సరస్సు గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనులకు సంబంధించిన భూమిని సైతం అధికారులు త్వరలో సేకరించి లక్నవరం సరస్సులోకి సైతం గోదావరి జలాలను తరలించనున్నారు.