కన్నాయిగూడెం, ఆగస్టు 7 : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరిలోకి వరద కొనసాగుతున్నది. గురువారం బరాజ్‌లో 30 గేట్లను బంద్ చేసి నీటిని నిల్వచేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 1,13,670 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో బరాజ్ మొత్తం 59 గేట్లకుగాను 29 ఎత్తి 1,11,656 క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి బరాజ్ వద్ద 74.20 మీటర్ల నీటి మట్టం నమోదైంది.
కాగా, ఎగువన ఉన్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులోని ఏడు మోటర్లతో గోదావరి నీటి పంపింగ్ కొనసాగుతుండగా, గురువారం మరో మోటర్ ఆన్ చేశారు. ఫేస్-1, 2లో నాలుగు, ఫేస్- 3లో మూడు మోటర్లు ఆన్‌లో ఉండగా ఫేస్-3 లోని మరో మోటర్ ఆన్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫేస్ -1, 2 లో రెండేసి చొప్పున, ఫేస్ -3 లోని నాలుగు కలుపుకోని మొత్తం 8 మోటర్ల ద్వారా రోజుకు 2014 క్యూసెక్కుల నీటిని భీంఘనపురం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నట్లు డీఈ శరత్, ఏఈఈ సాయిరాం తెలిపారు.